కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు అదనంగా కేటాయించిన బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) విధులను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ (AITUC) కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ అధికారులను కలిసి సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 50 శాతానికి పైగా అంగన్వాడీ కేంద్రాలలో హెల్పర్లు లేకపోవడంతో టీచర్లు ఒంటరిగా బోధనతో పాటు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో ఓటర్ల జాబితా సవరణ వంటి ఎన్నికల విధులు కూడా అప్పగించడం వల్ల కేంద్రాలు మూతపడే పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
టీచర్లు బీఎల్ఓ విధులలో నిమగ్నం కావడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహార పంపిణీతో పాటు ప్రీ-స్కూల్ బోధన దెబ్బతింటోందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఇతర శాఖల సిబ్బంది ఉన్నప్పటికీ అంగన్వాడీలపైనే ఈ భారాన్ని మోపడం సరికాదని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ పనుల కోసం ట్యాబ్లు, మొబైల్స్ వంటి సదుపాయాలు కల్పించకపోవడంతో పాటు టీఏ, డీఏ అలవెన్సులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం వెంటనే స్పందించి అంగన్వాడీ టీచర్లను బీఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మాతా శిశు సంరక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.

