కలం, వెబ్ డెస్క్: సాయిబాబా ఆలయాల (Sai Baba Temples)కు టీటీడీలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఇవ్వలేమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy) అన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో దేవాదాయ శాఖలో జరిగిన అభివృద్ధి పనులు, మార్పులు, సంస్కరణలకు సంబంధించిన నివేదికను మంత్రి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని శివాలయం, సీతారామాలయం, దుర్గమ్మ గుడి, వేంకటేశ్వర స్వామి సహా ఏ ఆలయం కావాలన్నా కట్టిస్తామని మంత్రి తెలిపారు. శ్రీవాణి నిధులతో ఎన్నో ఆలయాలు నిర్మిస్తున్నామని, అయితే తమ పరిధిలో లేని కొన్ని ఆలయాలను మాత్రం నిర్మించలేమని చెప్పారు.
సాయిబాబా భక్తుల్లో హిందువులతో పాటు ఇతర మతస్తులు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు. పురాణ గ్రంథాలు, పౌరాణిక శాస్త్రాల్లో షిరిడీ సాయి లేరని స్పష్టం చేశారు. సాయిబాబా ఆలయాలకు అనేక మంది ఆర్థిక తోడ్పాటు కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా షిరిడీ సాయి ఆలయాలను శ్రీవాణి నిధులతో నిర్మించలేమని చెప్పారు. నెల్లూరులో టీటీడీ నిధులతో నిర్మించిన సీతారామాలయం నిర్మాణం పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. జూలై చివరిలో తొలి శ్రీవాణి ఆలయాన్ని నెల్లూరు జిల్లాలో ఉన్న ఆత్మకూరు టిడ్కో కాలనీలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

