Mobile Popup Ad
Mobile Popup Ad

వ‌రి కొనుగోళ్ల‌పై కేంద్రం వర్సెస్ స్టేట్..!

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ అనేక అంశాల్లో కేంద్రం, రాష్ట్రం మధ్య ఘర్షణ వాతావరణమే కొనసాగుతున్నది. వడ్ల కొనుగోళ్ల (Paddy Procurement) విషయంలో సెంటర్ వర్సెస్ స్టేట్ ఫైట్ పరిష్కారం కాకపోగా.. మరింతగా ముదురుతున్నది. చివరి గింజ వరకూ కొంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫుడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంటున్నది సగం కంటే తక్కువే. వరి ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నందుకు సంతోషించాలా?.. లేక సొంత డబ్బులతో కొన్నా ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదని ఇబ్బందుల్లో పడాలా?.. ఇదీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తున్న సమస్య.

గత బీఆర్ఎస్ హయాంలో ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి స్థాయిలో ధర్నాలు జరిగినా పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ అదే తరహా సంక్షోభం కొనసాగుతున్నది. అటు కేంద్రంతో కొట్లాడడం.. ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో ఢీకొట్టడం.. అధికార కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. “కేంద్రం ఎంత కొంటే.. అంతే మేమూ కొంటాం..” అని రాష్ట్ర మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది.

ఏడు రెట్లు పెరిగిన ఉత్పత్తి

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేవలం 24 లక్షల టన్నులు పండిన వరి ఇప్పుడు 2026లో కోటిన్నర టన్నుల మార్కు దాటింది. ఇందులో హాస్టళ్లకు సరఫరా, రేషన్ దుకాణాలకు పంపిణీ లాంటి రాష్ట్ర అవసరాలను మినహాయిస్తే దాదాపు 80 లక్షల టన్నుల మేర రాష్ట్రమే కొనాల్సి వచ్చింది. కానీ, ఎఫ్‌సీఐ మాత్రం కేవలం 30 శాతానికే తన పరిధిని పరిమితం చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేయడం ఆపలేక.. ఎఫ్‌సీఐకి ఇవ్వలేక.. రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతున్నది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సొంత నిధులతో కొంటున్నది.

ఇప్పటికే సంక్షేమ పథకాలకు నిధులను సర్దుబాటు చేయడంలో దిక్కులు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల విషయంలో ఆర్థిక భారాన్ని మోయక తప్పడంలేదు. కేంద్రంతో కొట్లాడినా సమస్యకు పరిష్కారం దొరకని అయోమయం ఒకవైపు వేధిస్తుంటే రైతులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయనే ఆందోళన మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్‌లో నెలకొంది.

శాశ్వత పరిష్కారం ఎక్కడ?

వడ్లు తెలంగాణవి… రైతుల నుంచి కొనే బాధ్యతా తెలంగాణదే.. అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలోని పరిస్థితి. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం ముందున్న ప్రధాన వ్యవసాయ సవాళ్లలో ఒకటి రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం. ఈ పన్నెండేండ్లలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది.. కనీస మద్దతు ధర పెరిగింది.. ఎక్కువ ధాన్యం పండిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో ముందు వరుసలో ఉండటం రాష్ట్రం సాధించిన విజయమే అయినా కొనుగోలు చేయడం పెద్ద సవాలుగా మారింది. “రైతు నుంచి ధాన్యం కొనేది రాష్ట్ర ప్రభుత్వమే. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది రాష్ట్రమే. రైతు ఖాతాలో డబ్బు జమ చేసేదీ రాష్ట్ర యంత్రాంగమే. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొనుగోలు ప్రక్రియ నిర్వహించేదీ రాష్ట్ర ప్రభుత్వమే. కానీ, తుది దశలో ఆ ధాన్యం లేదా దాని నుంచి తయారైన బియ్యాన్ని స్వీకరించాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫుడ్ కార్పొరేషన్ (ఎఫ్‌సీఐ). అది బాధ్యత నుంచి తప్పుకోవడంతో ఆ భారం అంతా రాష్ట్రంపైనే పడుతున్నది. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిందే” అని రైతు సంఘం నాయకుడొకరు అన్నారు.

ప్రొక్యూర్‌మెంట్‌లో పాలిటిక్స్

– గతంలో బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. ఎఫ్‌సీఐ కొని తీరాల్సిందేనంటూ డెడ్‌లైన్ పెట్టారు. కానీ కేంద్రం రెస్పాండ్ కాలేదు. చివరికి రాష్ట్రమే కొనాల్సి వచ్చింది. అప్పట్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ తరహాలో పొలిటికల్ వార్ జరిగింది. కేంద్రంతో రాష్ట్ర ఘర్షణ వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ బీజేపీ వాదించింది.
– ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. కేంద్రం తీరు తెలిసినా వైఫల్యమంతా రాష్ట్రానిదేనంటూ మండిపడుతున్నది. తొమ్మిదిన్నరేండ్ల అనుభవం తెలిసినా వడ్ల కొనుగోలుపై పాలిటిక్స్ మొదలుపెట్టడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
– రాష్ట్రం నుంచి బియ్యాన్ని తీసుకోవాల్సిన ఎఫ్‌సీఐ ఆంక్షల పేరుతో కోటాను తగ్గించుకున్నా రాష్ట్రాన్నే బీజేపీ విమర్శిస్తున్నదని కాంగ్రెస్ లీడర్లు మండిపడుతున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
– చివరికి రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ.. ఏకంగా కేంద్రంపై పొలిటికల్ వార్ స్టార్ట్ చేసింది. కేంద్రం కొన్నంతే కొంటామని నిర్ణయం తీసుకున్నది. దీనికి ఇప్పుడు బీజేపీ సమాధానం చెప్పుకునే స్థితిలో ఇరుక్కున్నది.

ఎంఎస్పీ గొప్పలు.. సేకరణలో కిరికిరి

రైతుల సంక్షేమం కోసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచామని బీజేపీ అంటున్నది. కానీ, రాష్ట్రం నుంచి బియ్యాన్ని తీసుకోవడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ ఆంక్షలు విధిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ పేరుతో వివరణ ఇస్తున్నది. ఈసారి రబీలో రాష్ట్రంలో కోటిన్నర టన్నులు వరి ధాన్యం ఉత్పత్తి అయితే.. ఎఫ్‌సీఐ మాత్రం 52 లక్షల టన్నులు తీసుకుంటానని షరతు విధించింది. మిగిలిన ధాన్యాన్ని ఎవరు కొంటారన్నది ప్రశ్నార్థకం. వడ్ల సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్రం సంగతి చూస్తామంటూ ఆ మధ్య సీఎం రేవంత్ హెచ్చరించారు. ఆ వార్నింగ్‌కు కొనసాగింపుగానే.. కేంద్రం కొన్నంతనే కొంటామనే నిర్ణయాన్ని మంత్రుల సమావేశం ప్రకటించిదని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నది. పన్నెండేండ్లలో ఎన్నడూ ఎఫ్‌సీఐ పూర్తి స్థాయిలో ధాన్యాన్ని తీసుకోలేదు. రానున్న రోజుల్లో ఇది ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరం.

ఇదీ సంగతి..!

– రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేవలం 24 లక్షల టన్నులు పండిన వరి ఇప్పుడు 2026లో కోటిన్నర టన్నుల మార్కు దాటింది.
– ఇందులో హాస్టళ్లకు సరఫరా, రేషన్ దుకాణాలకు పంపిణీ లాంటి రాష్ట్ర అవసరాలను మినహాయిస్తే 80 లక్షల టన్నుల మేర రాష్ట్రమే కొన్నది. కానీ, ఎఫ్‌సీఐ మాత్రం కేవలం 30 శాతానికే తన పరిధిని పరిమితం చేసింది.
– బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ పాలన మొదట్లో (2018-19)లో 77.49 లక్షల టన్నుల వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొంటే.. ఎఫ్సీఐ తీసుకున్నది 40 శాతంలోపే!

తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు, ఎఫ్‌సీఐ తీసుకున్న బియ్యం ఇలా (లక్షల టన్నుల్లో)..

సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు ఎఫ్‌సీఐ తీసుకున్న బియ్యం

2014-15   24.30    11.10
2015-16   23.57    6.00
2016-17   53.84    24.70
2017-18   54.08    23.70
2018-19   77.49    32.20
2019-20   111.26  54.40
2020-21   141.03  60.00
2021-22   120.60  34.50
2022-23   131.86  50.70
2023-24   95.32    51.00
2024-25   128      47.20
2025-26   151      52 (టార్గెట్)

బీఆర్ఎస్ హయాం కంటే పెరిగిన ఉత్పత్తి

రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో పండిన పంటకంటే కాంగ్రెస్ హయాంలో వార్షిక సగటు ఉత్పత్తి పెరిగింది. మొత్తం తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి 832.86 లక్షల టన్నులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేండ్లలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం 279 లక్షల టన్నులు. బీఆర్ఎస్ హయాంలో సగటున ప్రతీ ఏటా రెండు సీజన్లలో కలిపి 87.66 లక్షల టన్నుల మేర రైతుల నుంచి వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. కాంగ్రెస్ హయాంలో ఇది 111.60 లక్షల టన్నులుగా రికార్డయింది. కాళేశ్వరం నీళ్లతోనే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందంటూ బీఆర్ఎస్ పదేపదే చెప్పుకుంటున్నది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మూడు నెలల ముందే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ రిపేర్ అయింది. అయినా అప్పటికంటే వరి ఉత్పత్తి ఎక్కువైంది. కాళేశ్వరం నీళ్లతో సంబంధం లేకుండానే వరి విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని కాంగ్రెస్ అంటున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>