కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో (Husnabad SU Engineering College) విద్యార్థుల వసతి సౌకర్యాల కల్పనకు కీలక అడుగు పడింది. శాతవాహన విశ్వవిద్యాలయం 86వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర హాస్టల్, బాలికల హాస్టల్ నిర్మాణ పనులకు అధికారికంగా ఎంట్రస్ట్మెంట్ ఆర్డర్లు జారీ చేసింది. ప్రతి హాస్టల్ నిర్మాణానికి రూ.7.28 కోట్ల (728 లక్షలు) అంచనా వ్యయంతో రెండు హాస్టళ్లు గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి మొత్తం 14.56 కోట్లు అంచనా వ్యయం తో పనులను చేపట్టాలని నిర్ణయించారు.
ఈ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGEWIDC) కు అప్పగించారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెం.132/1లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో హాస్టళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రణాళిక, డిజైనింగ్, నిర్మాణ పర్యవేక్షణ, ఈ-టెండర్ ప్రక్రియ నిర్వహణతో పాటు పనులను వేగవంతంగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను విశ్వవిద్యాలయం ఆదేశించింది. ఈ నిర్మాణాలకు అవసరమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం దశలవారీగా విడుదల చేయనుంది. పనులను 2027 జూన్ 30 నాటికి పూర్తి చేయాలని TGEWIDC అధికారులకు సూచించారు.
ఈ హాస్టళ్ల నిర్మాణం పూర్తయితే హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం మరింత సులభతరం కానుంది. హాస్టల్ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజా ప్రతినిదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు.

