కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ఆసనాలు చేసి ప్రజలకు యోగా ప్రాముఖ్యత వివరించారు.
యోగా భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా భాగమైందని, పూర్వికులు దీన్ని తమ దైనందిన జీవితంలో పాటించారని ఆయన గుర్తుచేశారు. పతాంజలి సంస్థ, బాబా రాందేవ్ కృషి వల్ల యోగా గ్రామాల వరకు విస్తరించిందని పేర్కొన్నారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సమతుల్యత కూడా లభిస్తుందని, కనీసం ప్రాణాయామం చేసిన అనేక రోగాలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. యోగా విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు బెక్కెరి మధుసూదన్ రెడ్డి, పతాంజలి యోగా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

