కలం, కరీంనగర్ బ్యూరో : భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా యోగ భూమిగా గుర్తింపు పొందిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లో నిర్వహించిన యోగా వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగాను దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల శరీరం బలంగా మారడంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరిగి సానుకూల దృక్పథం అలవడుతుందని బండి సంజయ్ వివరించారు. కరోనా మహమ్మారి సమయంలో యోగా, ప్రాణాయామం ప్రాముఖ్యతను ప్రపంచం మొత్తం గుర్తించిందని, అందుకే ప్రస్తుత వైద్యులు కూడా యోగాను బాగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. యోగా చేయడానికి ఎటువంటి ఖరీదైన పరికరాలు లేదా పెట్టుబడి అవసరం లేదని, కేవలం దృఢ సంకల్పం ఉంటే సరిపోతుందని చెప్పారు. యోగ చేస్తే రోగం దూరం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగా నేడు ఒక అంతర్జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి కొనియాడారు. 2014లో ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రధాని మోదీ ప్రతిపాదించిన కేవలం 90 రోజుల్లోనే 177 దేశాలు మద్దతు తెలపడం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమని గుర్తుచేశారు. దీని ఫలితంగానే జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా, నేడు 190కు పైగా దేశాల్లో వందల కోట్ల మంది యోగాను అనుసరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఒక భూమి – ఒక ఆరోగ్యం కోసం యోగా అనే సందేశంతో మోదీ యోగాను ప్రపంచ శ్రేయస్సుతో ముడిపెట్టడం భారతదేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు.
నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ రీ ఎగ్జామ్ రాసే విద్యార్థులందరికీ మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల పరీక్షలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని, అందువల్లే ఉదయమే యోగా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

