కలం, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఓ వార్తా పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. తన కుమార్తె అంజిలి రెడ్డి పెళ్లి సందర్భంగా ఆహ్వానం ఇచ్చేందుకు ఆమె చంద్రబాబుతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీకి అనుకూలంగా ఉండే ఓ పత్రికలో షర్మిల చంద్రబాబు చెట్టాపట్టాల్.. అంటూ ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి వయస్సు ఉండే వ్యక్తికి పెళ్లి కార్డు ఇస్తే ఇలా రాయడం ఏమిటని మండిపడ్డారు. ఈ మేరకు నేడు ఆమె ఎక్స్ వేదికగా ఓ సుధీర్ఘ పోస్టు చేశారు.
పెళ్లికి రమ్మని శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? అని నిలదీశారు. ఆహ్వానం కోసం కలిస్తే ఆత్మీయ సంబంధాలు అని దుష్ప్రచారం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వావి వరసలు తెలిసిన వాళ్లు చేసే పనేనా అంటూ ఘాటుగా స్పందించారు. తనపై పత్రికలో వచ్చిన ఈ కథనం తనకు, తన కుటుంబానికి తీవ్ర వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఉందని చెప్పారు. వైసీపీ, జగన్ అండ్ కో బుద్ధికి, దిగజారుడు సంస్కారానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. జగన్‌కు తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదని, అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదని ఎద్దేవా చేశారు. తన పత్రిక, మనుషులు మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదని పేర్కొన్నారు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదన్నారు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడమంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమేనని వ్యాఖ్యానించారు. తన పత్రికలో ఇలాంటి రాతలు రాయించినందుకు పత్రికతో సంజాయిషీ ఇప్పిస్తారా? జగన్ స్వయంగా సంజాయిషీ ఇస్తారా? తేల్చుకోవాలని షర్మిల స్పష్టం చేశారు.

