కలం, వెబ్‌డెస్క్: ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన వైఎస్ షర్మిల (YS Sharmila) కుమార్తె పెళ్లి వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ పెళ్లి వేడుక కోసం బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను వేదికగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే జగన్ మాత్రం ఇక్కడ పెళ్లి వద్దంటూ షర్మిలకు తేల్చి చెప్పారు. కావాలంటే లోటస్ పాండ్‌లో పెళ్లి చేద్దామని కూడా సలహా ఇచ్చారు. భద్రతా పరమైన సమస్యలతోనే ఇలా చెప్తున్నానని స్పష్టం చేశారు. మరోవైపు షర్మిల ఇప్పటికే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించేశారు. ఆ పత్రికల్లో యలహంక ప్యాలెస్‌లోనే పెళ్లి అని మెన్షన్ చేశారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర నోటరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరులోని యలహంక ప్యాలెస్ దాదాపు 20 ఎకరాల్లో ఉంది. ఇది పూర్తిగా వైఎస్ షర్మిలకు చెందినదని పేర్కొంటూ ఆమె తల్లి విజయమ్మ ధృవీకరించిన నోటరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ పత్రాల ద్వారా ఈ యలహంక భూమిపై షర్మిలకు పూర్తి హక్కులు ఉన్నాయని, ఆమెదే ఆ స్థలమనే విషయం స్పష్టమవుతోంది. తన కూతురి వివాహ వేడుకను అక్కడ జరుపుకోకుండా అడ్డుకోవడానికి వైఎస్ జగన్ ఎవరంటూ సోషల్ మీడియాలో ఈ నోటరీతో కొందరు ప్రశ్నిస్తున్నారు. యలహంక భూమి జగన్‌దేనని, దానిపై హక్కులన్నీ ఆయనకే ఉన్నాయన్న తీరుగా వైసీపీ, జగన్, ఆ పార్టీ ప్రతినిధులు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ నోటరీని ఎవరు బహిర్గతం చేశారు? గతంలో వచ్చిన జగన్ ఆస్తులకు సంబంధించి వచ్చిన నోటరీ, ఇది ఒకటేనా? అనేది తెలియాల్సి ఉంది. ఇది నిజంగా వైఎస్ విజయమ్మ సంతకం చేసిన నోటరీయేనా అన్నదానిపైనా స్పష్టం లేదు. దీనిపై విజయమ్మ కూడా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

