కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో (Kothagudem) పోలీస్ అమరవీరుల వారోత్సవాలు (Police Martyrs Week) ఘనంగా కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆదివారం కొత్తగూడెంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు, టీజీఎస్పీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సైకిల్ ర్యాలీ కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపం నుంచి ప్రారంభమై పాత డిపో, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ మీదుగా కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి సేవలను ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
దేశం, సమాజం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు భావి తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతి ఒక్కరూ పోలీసుల త్యాగాలను గుర్తుంచుకోవాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు పోలీసులు, ప్రజల మధ్య మైత్రిని, సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీతో పాటు టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్లు రామకృష్ణారెడ్డి, రంజిత్ కుమార్, సీఐలు వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, ఆర్ఐలు సుధాకర్, కృష్ణారావు, జి.వి. రామారావు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

