పసిఫిక్‌లో రికార్డు టెంపరేచర్.. ‘ఎల్ నినో’ మరింత తీవ్రతరం!

కలం, నేషనల్ డెస్క్ : ప్రపంచ వాతావరణ సమతుల్యతను శాసించే పసిఫిక్ మహాసముద్రం.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేడెక్కుతున్నది. ‘ఎల్ నినో’ (El Nino) తీవ్రత మరింత బలపడుతుండటంతో సెంట్రల్ ఈక్వటోరియల్ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మొట్టమొదటిసారిగా 30 డిగ్రీల సెల్సియస్‌ మార్కును తాకాయి. ఈ నెల 22న నమోదైన ఈ ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని అమెరికాకు చెందిన ‘నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్’ వెల్లడించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించగా, ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. సాధారణంగా ఎల్ నినో సమయంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కి, ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశలను, వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో మునుపటి కంటే అత్యంత శక్తివంతంగా మారడం ఆందోళన కలిగిస్తున్నది.

డిసెంబర్‌లో మరింత పీక్ స్టేజ్

వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) నివేదిక ప్రకారం.. ఈ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే జూన్‌లో 1.6 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదయ్యాయి. ఆగస్టు నాటికి ఈ వ్యత్యాసం 2.5 డిగ్రీలకు చేరింది. రానున్న నవంబర్-డిసెంబర్‌ మధ్య ఈ వ్యత్యాసం ఏకంగా 3.7 డిగ్రీలకు పెరగవచ్చని అంచనా. అదే జరిగితే, గతంలో 2015-16 మధ్య నమోదైన అత్యధిక 2.6 డిగ్రీలను కూడా అధిగమించనుంది. సముద్ర ఉష్ణోగ్రతలు ఇంతలా పెరుగుతుండటం వాతావరణ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నది.

భారత్‌పై తీవ్ర ప్రభావం

ఈ అసాధారణ వాతావరణ మార్పుల ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం.. 2026లో నైరుతి రుతుపవనాల సమయంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీనికి తోడు నవంబర్ నుంచి డిసెంబర్‌ వరకు దక్షిణ ద్వీపకల్పం, మధ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

చలికాలంలోనూ ఎండలే

రానున్న శీతాకాలంలోనూ దక్షిణాసియా అంతటా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) అంచనా వేసింది. ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది డిసెంబర్లో గరిష్ఠ స్థాయికి చేరుకుని, 2027 ప్రారంభం వరకు కొనసాగవచ్చని పేర్కొంది. స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపనున్నప్పటికీ.. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఈ అసాధారణ మార్పుల వల్ల దేశంలో తీవ్రమైన వేడి, వర్షపాతం తగ్గే ముప్పు ఉందని ఐక్యరాజ్యసమితి అధికారులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>