కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) ప్రణాళికా లోపాలు, పెరిగిన అంచనా వ్యయాలతో సంక్షోభంలో కూరుకుపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద కృష్ణా నదీ తీరాన ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద 5×800 మెగావాట్ల (40 వేల మెగావాట్లు) సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇది. 2017లో బీహెచ్ఈఎల్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో నిర్మాణ బాధ్యతలు అప్పగించినప్పుడు.. 3 నుంచి 4 ఏళ్లలోనే ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని భావించారు.
కానీ, 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా ప్రాజెక్టు నిర్మాణం సంపూర్ణంగా పూర్తికాకపోవడం గమనార్హం. ప్రారంభంలో రూ.25,096 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం, నిరంతర ఆలస్యం వల్ల నేటికి రూ.37,781 కోట్లకు పెరిగిపోయి ఖజానాపై తీవ్ర భారంగా మారింది. మొత్తం 2,800 ఎకరాల విస్తీర్ణంలో(2,096 ఎకరాల అటవీ భూమి, 704 ఎకరాల పట్టా భూములు) రూపుదిద్దుకుంటున్న ఈ ప్లాంట్ నిర్వహణకు ఏటా 3.72 టీఎంసీల నీరు అవసరం కాగా, కృష్ణా నది నుంచి ప్రభుత్వం 6.60 టీఎంసీల నీటిని కేటాయించింది.
బొగ్గు కొరతతో ముందట పడ్తలే..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (Yadadri Thermal Power Station) ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 50 శాతం విదేశీ బొగ్గు (కాకినాడ పోర్ట్ ద్వారా 328 కి.మీ దూరానికి రవాణా), 50శాతం స్వదేశీ బొగ్గును బ్లెండింగ్ చేసి వాడాలని ప్రతిపాదించారు (కేజీకి 4550 కిలో కేలరీల సీవీ, రోజుకు 4496 టన్నులు, ఏటా 13.81 మిలియన్ మెట్రిక్ టన్నులు). కానీ, ఆ తర్వాత 100 శాతం స్వదేశీ బొగ్గునే సింగరేణి నుంచి జీ-9 గ్రేడ్ (కేజీకి 4530 Kcal, 30% కంటే తక్కువ బూడిద) వాడేలా ఒప్పందాలు మార్చారు. 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (PLF) వద్ద రోజుకు 36,375 టన్నులు, ఏడాదికి 13.50 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు సింగరేణి నుంచి రావాలి.
ప్లాంట్లో స్టాక్ సున్నా..
అయితే బొగ్గు సరఫరాలో లోపాలు లేకపోలేదు. సింగరేణి వద్ద జి-9 గ్రేడ్ దొరక్కపోవడంతో, తక్కువ కెపాసిటీ(2800-3400 Kcal/Kg), 50శాతం కంటే ఎక్కువ బూడిద ఉండే జి-13 నుంచి జి-15 గ్రేడ్ బొగ్గును ఇస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి బాయిలర్లు దెబ్బతింటున్నాయి. జీ-9 అయితే రోజుకు 10 రైలు ర్యాక్లు అవసరం కాగా, ప్రస్తుతం నాసిరకం బొగ్గు కావడం వల్ల రోజుకు 4 నుంచి 5 ర్యాక్లు మాత్రమే వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ వైటీపీఎస్లో ఏ పూటకి ఆ పూటే అన్నట్లుంది.
బొగ్గు లేక నడుస్తున్న యూనిట్లను ట్రిప్ చేసిన సందర్భాలున్నాయి. సీఎండీ హరీష్ కోల్ ఇండియా నుంచి బొగ్గు పొందాలని భావించినా సింగరేణి ఒప్పందం అడ్డువచ్చింది. ఒడిశాలోని మహానది కోల్ఫీల్డ్స్, నైనీ బ్లాక్ నుంచి తేవడానికి యత్నించినా.. సింగరేణి కంటే కోల్ ఇండియా బొగ్గు ధర తక్కువగా ఉండటంతో కోల్ ఇండియా నుంచే పూర్తిస్థాయిలో పొందేలా సీఎం రేవంత్ స్పందించారు.
బెల్ట్ ఫెయిల్యూర్.. నదిలోకి బూడిద
గంటకు 2,750 టన్నుల సామర్థ్యంతో కన్వేయర్ బెల్ట్ నిర్మిస్తే.. లోపాలతో 1,300 నుంచి 1,400 టన్నులు మాత్రమే వెళ్తోంది. యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ నిర్వహణ లోపంతో గత జులై, ఆగస్టులో బూడిద నీరు కృష్ణా నదిలో కలవడం పర్యావరణ వేత్తలను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అడ్వాన్స్ డ్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ సిస్టమ్ తెచ్చినా, సిబ్బందికి అవగాహన లేక, పెర్ఫార్మెన్స్ గ్యారెంటీ టెస్టులు సరిగా చేయక ప్లాంట్ ఇంకా మాన్యువల్ మోడ్లోనే నడుస్తూ పదే పదే ట్రిప్ అవుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతో మే నెలలో యూనిట్-3లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో రూ.40 కోట్లకు పైగా విలువైన కేబుల్స్ కాలిపోయి, రెండు నెలలు ప్లాంట్ మూతపడింది.
రాష్ట్రానికి ప్రాణాధారం.. కానీ సాంకేతిక విఘాతం
ప్రస్తుతం దేశంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. దీంతో తెలంగాణలో జల విద్యుత్ ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేద్దామన్నా విద్యుత్ లభించని తీవ్రత ఉంది. గత నెల 9న రాష్ట్ర చరిత్రలోనే గరిష్టంగా 19,543 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావడం గమనార్హం. ఈ క్లిష్ట సమయంలో 4,000 మెగావాట్ల వైటీపీఎస్ ఉత్పత్తి రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపాలు, తీవ్ర బొగ్గు కొరతతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగక విద్యుత్ రంగానికి విఘాతం కలుగుతోంది.
ఐదు యూనిట్ల సీఓడీ స్టీరింగ్ ఇలా..
ఒప్పందం ప్రకారం 1, 2 యూనిట్లను 36 నెలల్లో 3, 4, 5 యూనిట్లను 48 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఆలస్యమవుతూ వచ్చిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 4 యూనిట్ల వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి (సీఓడీ) పూర్తయింది. కాగా, వచ్చే నెలలో 5వ యూనిట్ సీఓడీ పూర్తయితే టీజీ జెన్కో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 10,420 మెగావాట్లకు చేరుతుంది. అందులో ఒక్క థర్మల్ విద్యుత్ వాటానే 7,979 మెగావాట్లు (76%) కానుంది.
యూనిట్-2 : జనవరి 2025 (సీఓడీ పూర్తి)
యూనిట్-1 : జులై 2025 (సీఓడీ పూర్తి)
యూనిట్-4 : జనవరి 2026 (సీఓడీ పూర్తి)
యూనిట్-3 : మే 2026 (సీఓడీ పూర్తి)
యూనిట్-5 : వచ్చే నెల (నవంబర్)లో సీఓడీ పూర్తికానుంది.

