కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో ప్రభావంతో నీళ్లు, విద్యుత్‌కు తీవ్ర కొరత ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ప్రస్తుతం వానాకాలం పంటలను కాపాడుకోవడంతో పాటు తాగునీళ్లు సరఫరా చేయడమే సవాల్‌గా మారిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో యాసంగి పంటలను తగ్గించుకోవాలని, వరి అసలే సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. గురువారం సెక్రటేరియెట్‌లో ఎల్ నినోపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 75 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదని, ఇదొక పెను విపత్తు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కరోనా తరహాలో ప్రకృతి విపత్తు..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేకసార్లు ఎల్ నినో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘అవన్నీ సాధారణ కరువులాగే ఉన్నాయి. కానీ ఈసారి వచ్చిన సూపర్ ఎల్ నినో.. కరోనా తరహాలో ఒక ప్రకృతి విపత్తుగా ఉన్నది. వర్షాల్లేక, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గి, ఉష్ణోగత్రలు పెరిగి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గి సాగునీటికి ఇబ్బందులు వచ్చాయి. వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరి పంట వేయకుండా స్వచ్ఛందంగా వాయిదా వేసుకోవాలి.
ఇప్పుడు రిజర్వాయర్లలో ఉన్న నీటిని పొదుపుగా తాగునీటికి వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. వచ్చే ఏడాది జులై వరకు వీటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. సాగునీటికి వాడే అవకాశాలే లేవు. కరువు వచ్చిన ప్రతిసారి పేద రైతులు రాజులుగా వ్యవహరించి ప్రజల కడుపు నింపారు. ఇప్పుడు కూడా అదే పెద్ద మనసుతో రబీ సీజన్లో వరి సాగుకు బ్రేక్ ఇవ్వాలి. కరువును సమష్టిగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని సీఎం రేవంత్ కోరారు.
ఆరుతడి పంటలే ఆధారం..
వానాకాలం సీజన్ సందర్భంగానే ఎల్ నినో ముప్పును రైతాంగానికి వివరించామని, దాంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు రిజర్వాయర్లలో ఉన్న నీటిని సాగు అవసరాలకు వినియోగిస్తే, కేవలం నారుమళ్లకే సరిపోతాయని.. ఆ తర్వాత చుక్క నీరు కూడా అందదని, రైతులు ఆర్థికంగా నష్టపోతారని పేర్కొన్నారు. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా బేసిన్లో 72 శాతం, గోదావరి బేసిన్లో 40 శాతం మేర నీటి నిల్వలు తగ్గాయి.
ఇప్పుడున్న నీటిని రాష్ట్రంలోని దాదాపు 24 వేల గ్రామాలకు తాగునీటి అవసరాలకు 10 నెలల పాటు సరఫరా చేయాల్సి ఉంటుంది. కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్.. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ నీటి, విద్యుత్ ఇబ్బందులు ఉన్నాయి. రబీ సీజన్లో కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలి, నీటి అవసరం ఎక్కువగా ఉన్న పంటలను వేసి నష్టపోవద్దు” అని రైతులకు సూచించారు.
కేంద్ర సాయం కోరుతాం..
ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఇప్పటికే దాదాపు 13 లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటకు తగిన సాగునీరు అందించలేక రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. రబీ సీజన్లో పంటలు వేయలేక మరింతగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని విపత్తు నిర్వహణ నిధి నుంచి రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతాం. ఇందుకోసం కేంద్రం, రాష్ట్రం కలిపి 60:40 నిష్పత్తిలో భారాన్ని భరించే స్కీమ్‌ల కింద ఈ సాయం ఇవ్వాలని అడుగుతాం.
త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. నవంబర్ ఫస్ట్ వీక్‌లో నేనే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలుస్తాం” అని తెలిపారు. కరోనా కష్టకాలంలో కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు దీపాలు వెలిగించడం, గంటలు మోగించడం చేశామని.. అందులో రాజకీయాలను చూడలేదని, ఇప్పుడు కూడా ఎల్ నినో కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రానికి ఉందని సీఎం వ్యాఖ్యానించారు.
రానున్న రోజుల్లో మరింత తీవ్రం..
రానున్న రోజుల్లో ఎల్ నినో మరింత తీవ్రమవుతుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కంటిన్యూ అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘సాగునీరు అందని పరిస్థితుల్లో రైతులు బోరు బావుల ద్వారా నీటిని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో మోటార్లు ఆన్ చేసినా కాలిపోతున్నాయి. ట్రాన్స్ ఫార్మర్ల మీద లోడ్ పడి అవి కూడా దెబ్బతింటున్నాయి.
సాగునీరు, తాగునీటితో పాటు కరెంటు డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. మార్కెట్లో కొందామన్నా కరెంట్ దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో యూనిట్‌ను రూ.15 పెట్టి కొంటున్నది. ఇప్పటి వరకు కోతలు లేకుండా నెట్టుకొచ్చాం” అని వివరించారు. విద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల నుంచి సబ్సిడీ రేటుతో సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం.. తక్కువ ధరకు విక్రయిస్తే కొనడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు.
నీళ్లను కొనుక్కోలేం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వాయర్లలో గతేడాది ఈ సమయానికి 460 టీఎంసీలు ఉంటే, ఇప్పుడు 200 టీఎంసీలే ఉన్నాయని సీఎం రేవంత్ వివరించారు. ‘‘చలికాలానికి ముందే రిజర్వాయర్లు వట్టిపోయే పరిస్థితి ఉంది. ఏది కొనుకున్నా నీళ్లను కొనుక్కోలేం.. పొదుపుగా వాడుకోవాలి. ఒక్క చుక్క కూడా వృథా చేయొద్దు. యాసంగిలో సాగు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. రైతులు వరి వేయొద్దు. ఈ ఒక్క సీజన్ వాయిదా వేసుకోవాలి. ప్రాజెక్టుల్లో ఇప్పుడున్న నీళ్లను తాగు అవసరాలకే వాడుకోవాల్సి ఉంటుంది. రాబోయే 8–10 నెలలు అత్యంత కీలకం” అని సూచించారు.
రైతు కూలీలకు ఉపాధి పనులు..
పంటల సాగు తగ్గి, రైతు కూలీలకూ పని దొరకడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల దయనీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉపాధి పనులు కల్పిస్తున్నామని తెలిపారు. గతేడాది ఈ సమయానికి 25 వేల మంది ఉపాధి హామీ పనులు చేస్తే, ప్రస్తుతం రెండున్నర లక్షల మంది పాల్గొంటున్నారని వెల్లడించారు. ఉపాధి హామీ పనుల్లో చెరువులు, కుంటలను ప్రాధాన్యంగా తీసుకుని మరమ్మతులు చేయాలని సూచించారు. ఎల్ నినో వేళ ప్రజలతో పాటు అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
‘‘మీడియా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావును నోడల్ అధికారిగా నియమించాం. 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. అధికారిక సమాచారాన్ని ప్రజలకు చేరవేసి మనోధైర్యం కల్పించాలి. అరకొర సమాచారం ప్రజలను గందరగోళంలోకి నెడుతుంది” అని అన్నారు. ‘‘ఎల్ నినో పరిస్థితిపై నటుడు విజయ్ దేవరకొండ పబ్లిక్కు అప్పీల్ చేశారు. ఇదే తరహాలో సెలెబ్రిటీలు, క్రీడాకారులు, మేధావులు కూడా వారికి తోచిన తీరులో ప్రజలకు పిలుపునివ్వాలి” అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
13 ఏళ్లలో 14 వేల మెగావాట్లు..
- తెలంగాణ ఏర్పడే నాటికి ఆరేడు వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మాత్రమే ఉండేదని, ఇప్పుడది 20 వేల మెగావాట్లు దాటిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంటే 13 ఏండ్లలో 14 వేల మెగావాట్ల డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు.
- సాధారణంగా అక్టోబర్‌లో 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావాల్సి ఉన్నదని, కానీ ఇప్పుడది 20 వేల మెగావాట్లు దాటిందని తెలిపారు. మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత అక్టోబర్‌లోనే నెలకొన్నదని, గృహ విద్యుత్ వినియోగం కూడా బాగా పెరిగిందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే గరిష్ట స్థాయిలో అక్టోబర్ 15న మొత్తం విద్యుత్ డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరుకున్నదన్నారు.
- మరో 20 రోజుల్లో వానాకాలం పంటలు కోతకు రానున్నాయని, వీలైనంతగా వాటికి నష్టం కలగకుండా కరెంటు సరఫరా ఆగకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
- రాష్ట్రంలో 23% లోటు వర్షపాతం ఉన్నందున రిజర్వాయర్లు వట్టిపోయే దశలో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయొద్దని సూచించారు.

