కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో పిల్లల డిజిటల్ భద్రతకు సంబంధించి మెటా (Meta) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి ప్లాట్‌ఫారాల్లో పిల్లలకు లైంగిక వేధింపులు, వారి డేటాను దుర్వినియోగపరిచే ఘటనలపై వెంటనే ఫిర్యాదు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ విషయంలో భారత చట్టాల ప్రకారమే నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వివరించింది.
అంతేగాకుండా, హానికరమైన కంటెంట్ అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో పనిచేస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి లభించింది. మెటా నిర్ణయాన్ని కేంద్రం ఆహ్వానించింది. సోషల్ మీడియాను పిల్లలకు మరింత సురక్షితంగా మార్చే క్రమంలో ఇదొక గొప్ప ముందడుగుగా అభివర్ణించింది.
పిల్లల భద్రతకే ప్రాధాన్యం..
మెటా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తమ ప్లాట్‌ఫారాల్లో పిల్లల డిజిటల్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని, ఈ విషయంలో తమ వైపు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పిల్లల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలిగినా.. సైబర్ క్రైం పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదులు చేస్తామని వెల్లడించారు.

