కలం, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయని కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం ఉదయం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఏపీలో జన్మించిన ఆమె 1946లోనే త్యాగయ్య చిత్రంలో బాలనటుల కోసం పాటను ఆలపించారు. ‘ఎంత టక్కరి వాడు నారాజు’, ‘సరదా సరదా సిగరెట్టు’, ‘ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం’ వంటి పాటలతో ఆమె గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా 5 భాషల్లో ఆరు వేలకు పైగా పాటలు పాడారు. సంగీతానికే తన జీవితాన్ని అంకితం చేసిన జమునారాణి (Jamuna Rani).. జీవితాంతం బ్రహ్మచారిణిగానే గడపటం గమనార్హం.
ప్రత్యేక పురస్కారాలు..
తమిళానాడు ప్రభుత్వం ఆమెను అన్నాదురై పురస్కారం, కలైమామణి పురస్కారాలతో సత్కరించింది. అలనాటి గాయని జమునారాణి మృతి పట్ల దక్షిణ భారత చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దక్షిణ భారత భాషల్లో తన సుమధుర స్వరంతో దశాబ్దాలపాటు కోట్లాది మంది సంగీతాభిమానులను ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె ఇక లేరన్న తెలుసుకున్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన పలువురు ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
ఇవాళ అంత్యక్రియలు..
బెంగళూరులోని కల్లహళ్లి శ్మశానవాటికలో శుక్రవారం (జూలై 31) జమునారాణి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన జమునారాణి భౌతికంగా దూరమైనా, తన మధుర గీతాల రూపంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.

