కలం, నిర్మల్: వినాయక చవితి పండుగ వేళ కూరగాయల ధరలు తగ్గడంతో నిర్మల్ జిల్లా ప్రజలకు ఊరట లభించింది. గత నెల రోజులుగా అధికంగా ఉన్న ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో మార్కెట్లలో (Nirmal Markets) కొనుగోళ్లు పెరిగాయి. పండుగ వంటకాల కోసం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉండటంతో ఉపశమనం కలుగుతోంది. నిర్మల్ గాంధీ కూరగాయల మార్కెట్‌లో ప్రస్తుతం టమాటా కిలో రూ.15, ఆలుగడ్డ రూ.30, బెండకాయ రూ.30, వంకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.40, కాకరకాయ రూ.40, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.30, క్యారెట్ రూ.40, గోబీ రూ.50, దోసకాయ రూ.20, చిక్కుడుకాయ రూ.50, గోరుచిక్కుడు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ధరలు తగ్గడంతో పండుగ అవసరాల కోసం ప్రజలు పెద్దఎత్తున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.
నిమ్మకాయ ధర మాత్రం పైపైకి..
కూరగాయల ధరలు తగ్గి సామాన్యులకు ఊరటనిస్తుండగా.. నిమ్మకాయ ధర మాత్రం భిన్నంగా ఉంది. మార్కెట్‌లో నిమ్మకాయ కిలో రూ.200 వరకు పలుకుతోంది. దీంతో ఇతర కూరగాయల ధరలు తగ్గడంతో ఆనందపడుతున్న వినియోగదారులకు నిమ్మకాయ ధర భారంగా మారింది. వినాయక చవితి నేపథ్యంలో మార్కెట్లలో కొనుగోళ్లు పెరగడంతో కూరగాయల వ్యాపారం జోరందుకుంది.

