కలం, మిర్యాలగూడ: వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన వివాహిత అపహరణ, అత్యాచారం, దోపిడీ కేసు (Vadapally Rape Case)లో నల్లగొండ మహిళా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బానోత్ శ్రీను అలియాస్ చిన్నా (35) టాటా ఏస్ వాహనంలో భార్యాభర్తలను ఎక్కించుకుని వారి గమ్య స్థానానికి తీసుకెళ్తున్నాడు. వారు దిగాల్సిన ప్రదేశం రాగానే భర్త వాహనం దిగగానె, నిందితుడు వెంటనే డోర్ మూసివేసి వివాహితను బలవంతంగా అపహరించుకెళ్లాడు.
నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని మార్గమధ్యలో వదిలేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి, వాడపల్లి ఎస్సై కె. నరసింహారావు, మిర్యాలగూడ రూరల్ సర్కిల్ అప్పటి సీఐ ఏ. రమేష్ బాబు పక్కా ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. అఖిల వాదనలు వినిపించారు.
విచారణ అనంతరం నల్లగొండ మహిళా కోర్టు, నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి నేరం రుజువు కావడంతో నిందితుడికి 10 ఏళ్ల 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20,000 జరిమానా విధించారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా వేధింపుల ఘటన ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

