కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి (Waddepalle) మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ (Shanthinagar)లో దుండగులు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శాంతినగర్లోని ఇందిరా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న భాగ్యమ్మ – మాధవ రావు దంపతులు శుభకార్యానికి వెళ్లేందుకు బుధవారం స్థానిక బ్యాంక్లో గల లాకర్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు ఇంటికి తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో ఆభరణాలను ఇంట్లో బీరువాలో పెట్టి, ఇంటికి తాళం వేసి ఒక ఫంక్షన్కు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు.
ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న సామాన్లు చిందరవందరం చేశారు. బీరువాలో దాచుకున్న విలువైన వస్తువులు కనిపించలేదు. బీరువాలో ఉన్న 30.7 తులాల బంగారం, 1.5 కేజీల వెండి, రూ. 14,000 నగదు అపహరణకు గురికావడంతో శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాంతినగర్ ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటిని పరిశీలించి బాధితుల నుండి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

