కలం, కరీంనగర్ బ్యూరో: శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవి కాలం ముగియడంతో ఆ పీఠాన్ని (SUDA Chairman) దక్కించుకునేందుకు పలువురు జిల్లా కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ఆరంభించారు. ఓవైపు పార్టీకి చేసిన సేవలను ఏకరువు పెడుతూనే, మరోవైపు టీపీసీసీ, ఏఐసీసీ నేతలతో సంబంధాలు ఉన్న ప్రముఖుల ద్వారా లాబీయింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ పదవిని ఒక పర్యాయం నిర్వహించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరోసారి రెన్యువల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా సీనియర్ కాంగ్రెస్ నేత, ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు ఆసంపల్లి శ్రీనివాస్ (Asampalli Srinivas) సుడా చైర్మన్ పదవిపై కన్నేశారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఒకసారి సుడా చైర్మన్ గా పనిచేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి తిరిగి పదవి కట్టబెట్టద్దని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొత్తవారికి అవకాశం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్.. శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అనుచరుడే కాకుండా, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు సన్నిహితుడిగా కాంగ్రెస్ శ్రేణుల్లో సుపరిచితుడు. ఇదే కారణంగా కరీంనగర్ నివాసి అయిన ఆసంపల్లి శ్రీనివాస్ కు సుడా చైర్మన్ (SUDA Chairman) పదవి దక్కుతుందనే ధీమాను అతని అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. అసంపల్లి శ్రీనివాస్ కు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శ్రీనివాస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ వివిధ సామాజిక సమీకరణాల కారణంగా టికెట్ దక్కలేదు.
సీనియర్ వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, సైక్లింగ్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా, తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవాధ్యక్షులుగా ఆసంపల్లి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అసంపల్లి శ్రీనివాస్ కు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. అందరి ఆశీస్సులతో తనకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కుతుందని ధీమాతో అసంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
Read Also: ఒకటి తీరేలోపే మరొకటి.. సర్కారు సతమతం!
Follow Us On : WhatsApp

