కొద్ది గంటల్లో బస్సులు బంద్.. మోగనున్న ఆర్టీసీ సమ్మె సైరన్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ కానున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కార్మికులు డిమాండ్ చేస్తూ ఇవాళ అర్ధరాత్రికే సమ్మె సైరన్ మోగించనున్నారు. కొన్ని గంటల్లో సమ్మె చేపట్టనుండగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారికంగా ఎటువంటి పిలుపు రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ బస్సుల బంద్ (Bus Strike) నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రయాణానికి ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో అన్న ఆలోచన ఆందోళన కలిగిస్తోంది. బస్సులు బంద్ కాకముందే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి రవాణా వ్యవస్థ స్తంభించకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సుల బంద్‌తో తెలంగాణ రవాణా వ్యవస్థ ఒక్కసారిగా ఆగిపోనుంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. తెలంగాణలో అతిపెద్ద బస్టాండులు అయిన హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోనుంది. ఒక వేళ బస్సులు బంద్ అయితే బస్టాండ్ లోనే ప్రయాణికులు ఉండిపోనున్నారు. ఈ తరుణంలో ఆర్టీసీ జేఏసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలని, తమకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజారిటీ అంశాలకు రేవంత్ సర్కార్ సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ డిమాండ్లలో ప్రధానమైన ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’, ‘యూనియన్ల పునరుద్ధరణ’ అనే రెండు డిమాండ్ల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ రెండూ మినహా మిగిలిన అన్నింటిపై సానుకూలత వ్యక్తం చేసింది. అయితే తమ అన్ని డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు. ఒకవేళ చర్చలకు పిలిచినా గతంలో మాదిరి నామమాత్రం హామీ ఇవ్వకూడదని, అన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమణ ఆలోచన చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అటు ఈ అంశంపై ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లపై చర్చించాలని, బస్సులు బంద్ కాకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ సమ్మె సైరన్ నేపథ్యంలో రాష్ట్రంలో బస్సుల బంద్ పై టెన్షన్ వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>