కలం, వెబ్ డెస్క్: దుర్గామాత ఊరేగింపు సమయంలో గుర్తుతెలియని దుండగులు కోడిగుడ్లతో దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో పాతబస్తీ (Hyderabad Old City) మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీర్ సావర్కర్ నవ యువ సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే చివరిరోజైన నిమజ్జనం చేసే సమయంలో ఏర్పాటు చేసిన దుర్గా మాత విగ్రహ ఊరేగింపుపై గుర్తుతెలియని దుండగులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.
ఊరేగింపు ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడటంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు అమ్మవారి ఊరేగింపు వద్దకు చేరుకొని తీవ్ర నిరసన తెలిపారు. దుండగుల దాడికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున భజనలు చేస్తూ, ధర్నాకు దిగారు. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యవహరించిన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మాదన్నపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు.. జాబితా సిద్ధం!
Follow Us On: X(Twitter)

