కలం, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్నకు (Rohan Bopanna) ఏఐటీఏ జాబితాలో చోటు దక్కలేదు. స్పోర్ట్స్పర్సన్స్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్ మెరిట్ (SOM) జాబితాలో ఆయన పేరును చేర్చలేదు. రిటైర్మెంట్ తీసుకుని ఏడాది పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. 46 ఏళ్ల బోపన్న 2025 నవంబర్ 1న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జాబితాలో చోటు పొందేందుకు దరఖాస్తు చేసుకునే సమయానికి కనీసం ఏడాది పాటు పోటీలకు దూరంగా ఉండాలనే నిబంధన ఉంది. దీంతో బోపన్నకు అర్హత లభించలేదు.
2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత బోపన్న భారత జట్టు తరఫున ఆడటం నుంచి తప్పుకున్నాడు. అంతకుముందే 2023లో మొరాకోతో డేవిస్ కప్ మ్యాచ్ తన చివరి అంతర్జాతీయ పోటీ అని ప్రకటించాడు. అయితే అంతర్జాతీయ టెన్నిస్‌కు దూరమైనా, ఏటీపీ టూర్లో కొనసాగాడు. 2025 నవంబర్లోనే ప్రొఫెషనల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. తన అర్హతపై బోపన్న ముందుగానే స్పష్టత కోరినట్లు సమాచారం. నిర్వాహకురాలు గీతా మిట్టల్ నుంచి వివరణ తీసుకున్న తర్వాతే దరఖాస్తు సమర్పించాడు. అంతర్జాతీయ పోటీల నుంచి తప్పుకోవడాన్ని రిటైర్మెంట్గా పరిగణించడంలో గందరగోళం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
బోపన్న భారత టెన్నిస్‌కు విశేష సేవలందించాడు. 2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచాడు. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లోనూ విజేతగా నిలిచాడు. 43 ఏళ్ల వయసులో పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. యువ ఆటగాళ్లు విదేశాల్లో పోటీలు ఆడేందుకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ద్వారా కూడా తన వంతు మద్దతు అందిస్తున్నాడు. ఏఐటీఏ జాబితాలో మొత్తం 40 మందికి చోటు కల్పించారు. ఇందులో 20 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. లియాండర్ పేస్‌కు తొలి శ్రేణిలో స్థానం లభించింది. మహేశ్ భూపతి, సానియా మీర్జా రెండో శ్రేణిలో ఉన్నారు. ఈ జాబితాలోని ఆటగాళ్లు ఏఐటీఏ జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో క్రీడాకారుల ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో భాగం కానున్నారు. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 23 నుంచి 25 వరకు జరగనుంది. ఎన్నికలు నవంబర్ 5న నిర్వహించనున్నారు.

