కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా రైతుల అభివృద్ధికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) సూచించారు. పట్టణణంలోని ఎల్.ఎల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రైతు సేవా సంకల్ప సభ పేరిట ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు చైర్మెన్ కొలుగూరి దామోదర్ రావు, నూతన కార్యవర్గ సభ్యులు, వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశంలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగిత్యాల పట్టణంలో మార్కెట్ల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉన్న రైతు బజార్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతో ప్రస్తుతం అది రైతులకు లాభసాటిగా మారిందని పేర్కొన్నారు. చల్గల్ వ్యవసాయ మార్కెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1.80 కోట్ల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగిత్యాల అభివృద్ధిని ఆపడం ఎవరి వల్లా కాదనిఎమ్మెల్యే సంజయ్ అన్నారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పీఏసీఎస్‌ల నూతన కార్యవర్గ సభ్యులు రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేయాలని ఆకాంక్షించారు. రానున్న ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేసే విధంగా చొరవ చూపాలని సూచించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తాం..
జగిత్యాల పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జగిత్యాల పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించిన నాయకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, రైతులకు అవసరమైన సహకార సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
సహకార సంఘం ద్వారా రైతులకు అందాల్సిన సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకుంటానని దామోదర్ రావు తెలిపారు. రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల సహకారంతో ముందుకు సాగుతానని చైర్మన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, మాజీ పాక్స్ చైర్మెన్ సదాశివ రావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దుమల రాజ్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, చిక్కుల భూమయ్య, పాక్స్ డైరెక్టర్లులు అదరవేని రాజయ్య, మంచాల మల్లేశం, నట్టి వెంకటేశం, బల్లని సారయ్య, రేగుంట దుబ్బవ్వ, పునుగోటి పురుషోత్తం రావు, నీరటి గంగారెడ్డి, జుంబర్తి శంకర్, బొల్లె గంగయ్య, కేతి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నాగిరెడ్డి గంగారెడ్డి, సర్పంచులు, రైతులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

