కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఏసీబీ (Telangana ACB) వలలో మరో ఇద్దరు అవినీతి అధికారులను చిక్కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భగీరథిపేట పీఎంకేఎస్‌వై 2.0 ప్రాజెక్టు (Bhageerathipeta Project)లో పని చేస్తున్న ప్రాజెక్టు అధికారి సతీశ్ రెడ్డి, టెక్నికల్ అధికారి రాజులను వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపు, తదుపరి పనుల కేటాయింపు కోసం బిల్లు మొత్తంలో 10 శాతం నుంచి 25 శాతం వరకు అక్రమంగా లంచం డిమాండ్ చేసినట్లు వీరిపై ఫిర్యాదు అందింది.
నిందితుల సూచనల మేరకు వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఖాతాలకు మొత్తం రూ.39.17 లక్షలు బదిలీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫిర్యాదుదారుడు బ్యాంకు స్టేట్‌మెంట్లు, వాట్సాప్ చాట్ వివరాలను ఆధారాలుగా సమర్పించారు. అంతేకాకుండా ఏడో బిల్లుకు సంబంధించిన మొత్తంలో అదనంగా 25 శాతం ఇవ్వాలని ప్రాజెక్టు అధికారి సతీశ్ రెడ్డి డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇద్దరిపై కేసు కేసు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వరంగల్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

