కలం, ఆదిలాబాద్: పండుగ సాయన్న జయంతి (Panduga Sayanna Jayanti) వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారకానగర్ రోడ్డులోని పండుగ సాయన్న విగ్రహానికి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) , ఎంపీ గోడం నగేష్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం మేరకు పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రతి జిల్లాలో అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. యువకులు, విద్యార్థులు పండుగ సాయన్న జీవిత చరిత్రను తెలుసుకొని, వారి బోధనలను నిత్య జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.
బడుగు బలహీన వర్గాల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా పండుగ సాయన్న చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఎస్సై, కానిస్టేబుల్, ఫౌండేషన్ కోర్సులకు దాదాపు 200 మందికి పైగా యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

