కలం, వెబ్ డెస్క్ : ఆధ్యాత్మిక సాధనల పేరుతో ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటనలో శ్రీవిద్యా సాధనా సెంటర్ నిర్వాహకుడు, శ్రీ చైతన్య గురూజీ (Sri Chaitanya Guruji) అలియాస్ మేరెడ్డి సునీల్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నం.71లో సునీల్ రెడ్డి శ్రీవిద్యా సాధనా సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రానికి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (విష్ణుదీప్రెడ్డి) భార్య క్రమం తప్పకుండా వెళ్తుండేవారు. ఈ క్రమంలోనే ఆమెతో ఆధ్యాత్మిక సాధనల పేరుతో సాన్నిహిత్యం పెంచుకున్న సునీల్రెడ్డి, ఆ తర్వాత అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వ్యక్తిగతంగా చాటింగ్ చేయడం ప్రారంభించాడు.
ఈ విషయం గురించి తెలుసుకున్న బాధితురాలి భర్త విష్ణుదీప్ రెడ్డి, సాధనా సెంటర్కు వెళ్లి సునీల్రెడ్డిని నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన గురూజీ.. ‘నీ జీవితం నాశనం చేస్తా, మళ్లీ ఇక్కడికి వస్తే చంపేస్తా’ అని బెదిరించాడు.
తన వైవాహిక జీవితంలో గందరగోళం సృష్టించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడిన గురూజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

