కలం, వెబ్ డెస్క్ : ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Elections) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడంతో పాటు పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల కవరేజ్, లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని, అభ్యర్థుల రక్షణపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
విచారణలో భాగంగా ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను నిరోధించి వాతావరణాన్ని శాంతియుతంగా ఉంచేందుకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, విస్తృత భద్రతా చర్యలు అత్యంత అవసరమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయ స్థానం.. స్థానిక ఎన్నికలపై స్పష్టమైన ప్రణాళికతో పూర్తి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, అలాగే డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

