ఉప్పల్‌లో వార్ వన్‌సైడ్.. ఢిల్లీకి చుక్కలు చూపించిన సన్‌రైజర్స్!

కలం, స్పోర్ట్స్  : ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ (SRH vs DC) వీర విహారం చేసింది. బ్యాటర్లు అదరగొడితే.. బౌలర్త తామేం తక్కువ కాదన్నట్లు చితక్కొట్టారు. ఏది ఏమైనా ఎస్ఆర్‌హెచ్ దెబ్బకు ఢిల్లీ తేలిపోయింది. ఢిల్లీపై ఎస్ఆర్‌హెచ్ 47ర పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటర్లలో అభిషేక్ శర్మ పరుగుల వరద పారిస్తే, బౌలర్లలో మలింగ, హర్ష్ తమ సత్తా చాటారు. ఆఖరి ఓవర్లో హర్ష్ మూడు వికెట్లు తీసీ మ్యాజిక్ స్పెల్‌తో ఔరా అనిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా ట్రావిస్ హెడ్ 26 బంతుల్లో 37 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 25 పరుగులు చేసి వేగంగా స్కోరు పెంచారు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ కేవలం 13 బంతుల్లోనే 37 పరుగులు బాది (3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయగలిగారు. ముఖేష్ కుమార్, నితీష్ రాణా, లుంగీ ఎన్గిడి లాంటి బౌలర్లు ఓవర్‌కు 10 పరుగులకు పైగా సమర్పించుకుని ధారాళంగా పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా నితీష్ రాణా 4 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి అత్యధిక ఎకానమీ రేటును నమోదు చేశారు.

243 పరుగుల హిమాలయమంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దశలోనూ విజయం వైపు సాగలేకపోయింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (8) త్వరగానే పెవిలియన్ చేరగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ (37) పోరాడే ప్రయత్నం చేశారు. నితీష్ రాణా 30 బంతుల్లో 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, అతనికి అవతలి వైపు సరైన సహకారం అందలేదు. సమీర్ రిజ్వీ (41), ట్రిస్టన్ స్టబ్స్ (27) మెరిసినా అవి విజయాన్ని అందించలేకపోయాయి. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఈషన్ మలింగ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టారు. హర్ష్ దూబే కేవలం 2 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి ఢిల్లీ లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. దిల్‌షాన్ మధుశంక, షకీబ్ హుస్సేన్ చెరో వికెట్ సాధించగా, నితీష్ కుమార్ రెడ్డి కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. మొత్తమ్మీద సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ జెండాను రెపరెపలాడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>