కలం, స్పోర్ట్స్: దాదాపు రెండు దశాబ్దాల ఫుట్‌బాల్ కెరీర్‌కు స్పెయిన్ స్టార్ జువాన్ మాతా (Juan Mata) ముగింపు పలికాడు. 38 ఏళ్ల మాతా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. చెల్సీ, మాంచెస్టర్ యునైటెడ్ వంటి ప్రముఖ క్లబ్‌లతో పాటు స్పెయిన్ జట్టుకూ ఎన్నో విజయాలు అందించాడు. 2010లో ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులో మాతా సభ్యుడు. 2012 యూరో కప్ ఫైనల్లో ఇటలీపై గోల్ చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. స్పెయిన్ తరఫున 41 మ్యాచ్‌లు ఆడి 10 గోల్స్ చేశాడు.
క్లబ్ కెరీర్లో ఎన్నో టైటిళ్లు
రియల్ మాడ్రిడ్ యువ జట్టుతో కెరీర్ ప్రారంభించిన మాతా.. వాలెన్సియా తర్వాత 2011లో చెల్సీలో చేరాడు. 2012లో ఛాంపియన్స్ లీగ్, ఎఫ్ఏ కప్ గెలిచాడు. 2014లో మాంచెస్టర్ యునైటెడ్‌కు మారి ఎనిమిదేళ్లు ఆడాడు. అక్కడ 2016లో ఎఫ్ఏ కప్, 2017లో యూరోపా లీగ్ టైటిళ్లు అందుకున్నాడు. 2022లో యునైటెడ్‌ను వీడిన తర్వాత గలాటసరాయ్తో టర్కీ లీగ్ టైటిల్, విసెల్ కోబేతో జపాన్ లీగ్ టైటిల్ గెలిచాడు. చివరిగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విక్టరీ తరఫున ఆడాడు. ఆ క్లబ్ తరఫున 25 మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ చేసి, మరో 12 గోల్స్‌కు సహకరించాడు.
మైదానం బయటా సేవ
2017లో కామన్ గోల్ కార్యక్రమాన్ని ప్రారంభించడంలో మాతా కీలక పాత్ర పోషించాడు. ఇందులో భాగంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమ ఆదాయంలో ఒక శాతాన్ని సామాజిక సేవకు అందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచకప్, యూరో కప్, ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ వంటి ప్రధాన టైటిళ్లు గెలిచిన మాతా.. ఇప్పుడు ఆటకు వీడ్కోలు పలికాడు.

