యాదగిరిగుట్ట ఆలయ భద్రతపై ఎస్పీ సమీక్ష

కలం, యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ (Yadagirigutta Temple) భద్రతను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్‌ ఐపీఎస్‌ చర్యలకు ఉపక్రమించారు. ఆలయ భద్రతపై ఈఓ, ఎస్పీఎఫ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను కొనసాగించాలని ఆదేశించారు. ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆలయానికి వచ్చే భక్తుల భద్రత, నేరాల నివారణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కల్యాణకట్ట, పుష్కరిణి ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి

ఆలయ (Yadagirigutta Temple) పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ.. ప్రతి కెమెరా నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కీలక ప్రాంతాల్లో నిఘాను బలోపేతం చేయడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, భద్రతా తనిఖీలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్‌, ఎస్పీఎఫ్‌, ఆలయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా విధుల్లో అప్రమత్తత పాటించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఆలయ ఈఓ భవానీ శంకర్‌, యాదాద్రి డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు, సీఐ శంకర్‌ గౌడ్, ఆర్‌ఐ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ వెంకటేశ్వర్లు,ఆర్ఐ శేషగిరి, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>