కేకేఆర్ గజగజలాడించిన గుజరాత్.. అదరగొట్టిన గిల్

కలం, స్పోర్ట్స్ : హోమ్ గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ మరోసారి జైత్రయాత్ర కొనసాగించింది. శుక్రవారం జరిగిన పోరులో (GT vs KKR) సమిష్టి ప్రదర్శనతో కట్టుదిట్టం చేసిన టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో సునాయాసంగా మార్చేశాడు. బౌలింగ్‌లో రబడా, సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో కేకేఆర్ బ్యాటర్లను బెంబేలెత్తించగా, ఛేదనలో గిల్ వీరవిహారం చేసి జట్టుకు (GT vs KKR) ఘన విజయాన్ని అందించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే (0) మొదటి ఓవర్‌లోనే సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా, యువ ప్లేయర్ రఘువంశీ (8) కూడా విఫలమయ్యాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కామెరాన్ గ్రీన్ అద్భుతంగా ఆదుకున్నాడు. గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు సాధించే దిశగా నడిపించాడు. రోవ్‌మన్ పావెల్ (27) నుంచి అతనికి మద్దతు లభించినా, రింకూ సింగ్ (1), సునీల్ నరైన్ (0) విఫలమవ్వడం జట్టు స్కోరును దెబ్బతీసింది. గుజరాత్ బౌలర్లలో కాగిసో రబడా (3/29) కేకేఆర్ మిడిలార్డర్‌ను ముంచేయగా, సిరాజ్ (2/23), అశోక్ శర్మ (2/45) కీలక వికెట్లు తీశారు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది.

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్ (22), శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేకేఆర్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తూ 50 బంతుల్లోనే 86 పరుగులు (8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి విజయాన్ని ఖాయం చేశాడు. మధ్యలో జోస్ బట్లర్ (25), వాషింగ్టన్ సుందర్ (13) త్వరగానే అవుట్ అయినప్పటికీ, గిల్ విధ్వంసం గుజరాత్‌ను సురక్షిత తీరానికి చేర్చింది. చివర్లో రాహుల్ తెవాటియా (7*), ప్రసిద్ధ్ కృష్ణ (3*) మరో 2 బంతులు మిగిలి ఉండగానే 181/5 స్కోరుతో గెలిపించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/34) కాస్త ప్రభావం చూపగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, రమణ్‌దీప్ తలో వికెట్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>