కలం, స్పోర్ట్స్: భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన అనుమతి లేకుండానే వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్లో తన పేరు చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో తాను ఆడటం లేదని తాజాగా వెల్లడించాడు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా ధావన్ తన వైఖరిని స్పష్టం చేశాడు. తనకు తెలియకుండా, అనుమతి తీసుకోకుండా నిర్వాహకులు తన పేరును ఉపయోగించారని తెలిపాడు. ఈ విషయంలో తన బృందం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నాడు.
తన భాగస్వామ్యంపై వచ్చే అనధికారిక ప్రకటనలను నమ్మవద్దని మీడియా, అభిమానులకు సూచించాడు. ఈ టోర్నీలో ధావన్ ఆసియా వారియర్స్ జట్టు తరఫున ఆడనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాళ్లు రాహుల్ శర్మ, గుర్కీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్ పేర్లు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ ఆటగాళ్లు సోహైల్ తన్వీర్, ఇఫ్తిఖార్ అహ్మద్ వంటి వారి పేర్లు కూడా జట్టులో కనిపించాయి. అయితే, ధావన్ ప్రకటనతో ఆయన పాల్గొనడంపై స్పష్టత వచ్చింది. నిర్వాహకులు కూడా ఆయన ఆసియా వారియర్స్ జట్టులో ఉండరని తాజాగా ప్రకటించారు.

