కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామ శివారులో ఉన్న సమ్మక్క, సారక్క ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్మవార్ల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన ఈ దుశ్చర్యపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ పైకప్పును పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి, అమ్మవార్ల విగ్రహాలను బయటకు తీసి నేలపై పడేశారు.
అంతేకాకుండా ఆలయంలోని పూజా సామగ్రిని పూర్తిగా చిందరవందర చేసి అపవిత్రం చేశారు. ఇటీవల జరిగిన బతుకమ్మ వేడుకల సమయంలో తలెత్తిన గొడవలే ఈ ఘటనకు ప్రధాన కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు కావాలనే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ఆరోపించారు.
దేవాలయాలను, దేవుళ్లను అవమానించే ఇలాంటి అసాంఘిక శక్తులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దెబ్బతిన్న సమ్మక్క-సారక్క ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read : పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Follow Us On : WhatsApp

