కలం, వెబ్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చేసే ప్రతి వ్యాపారం, అందించే సేవలు భారత చట్టాలకు లోబడే ఉంటాయని ప్రకటించింది. తమ సంస్థ పోటీకి ఎప్పుడూ భయపడలేదని.. కస్టమర్లకు ఎవరు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారో తెలుసుకోవడానికి పోటీనే నిజమైన పరీక్షగా భావిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఎలన్ మస్క్ (Elon Musk) సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీపై చేసిన ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. ‘రిలయన్స్, భారత మార్కెట్పై కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరుకుంటున్నాం.
ప్రతి సంస్థ మాదిరే ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా కొత్త ఆవిష్కరణలు కోరుకునే భారతదేశంలో రిలయన్స్ సంస్థ అభివృద్ధి చెందుతూ వస్తోంది. భారతీయులైనా.. విదేశీయులైనా.. ఎవరు దరఖాస్తు చేసుకున్నా అందరికీ ఒకే విధమైన ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ వాతావరణం పూర్తిగా చట్టబద్ధ పాలనపైనే ఆధారపడి నడుస్తోంది’ అని స్పష్టం చేసింది.
తక్కువ ధరకే డేటా..
భారతదేశంలో అత్యంత తీవ్రమైన పోటీ ఉండే టెలికాం మార్కెట్లోకి 2016లో జియో ప్రవేశించిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) తెలిపింది. ‘అప్పుడు మాకు ఒక్క కస్టమర్ కూడా లేడు. గత పదేళ్లలో వారి విశ్వాసాన్ని పొందడం ద్వారా ఈ రోజు 53 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాల్లో కొన్నింటిని అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నాం.
స్టార్ లింక్ (Starlink) సహా శాటిలైట్ కమ్యూనికేషన్ల రంగంలో పోటీని మేం స్వాగతిస్తున్నాం. జియోతో సహా ప్రతి సంస్థ భారత ప్రజలకు సేవలు అందించాలనుకుంటే ఇక్కడి చట్టాలు, విధానాలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. జియోకు సంబంధించిన శాటిలైట్ సేవలకు ఇంకా అనుమతులు లభించాల్సి ఉంది’ అని స్పష్టం చేసింది.
Also Read : అమెరికా స్కూల్లో దారుణం: కాల్పుల్లో నలుగురు మృతి!
Follow Us On: Youtube

