కలం, వెబ్ డెస్క్ : ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది సీజన్‌లో మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. వరుస ఓటములతో జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుండగా, కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ముఖంలో కూడా ఆ నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సమయంలో తన వద్ద చెప్పడానికి ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో, ముంబై జట్టు వైఫల్యాలను విశ్లేషిస్తూ మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలింగ్ పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. 190 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో బౌలర్లు పట్టుదలగా ఆడలేకపోయారని విమర్శించారు. ప్రత్యేకంగా దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్‌లోనే 21 పరుగులు ఇవ్వడం మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని అశ్విన్ (Ravichandran Ashwin) చెప్పారు. తర్వాత బుమ్రా, అల్లా గజన్ఫర్ మ్యాచ్‌ను మళ్లీ ముంబై వైపు తిప్పే ప్రయత్నం చేసినప్పటికీ, కీలక సమయంలో మళ్లీ చాహర్‌ను బౌలింగ్‌కు దించడం పెద్ద తప్పిదమని విశ్లేషించారు.
హార్దిక్ పాండ్యా తన వద్ద సమాధానాలు లేవని అనడం వెనుక అసలు కారణం, జట్టు లోపాలను సరిదిద్దే మార్గం కనిపించకపోవడమేనని అశ్విన్ పేర్కొన్నారు. ఒకవైపు కోచ్ మహేల జయవర్ధనే స్కోరు 20 పరుగులు తక్కువని చెబుతున్నప్పటికీ, ఆ పిచ్‌పై 230 చేసినా కూడా కాపాడుకోవడం కష్టమేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకూర్ వంటి అనుభవజ్ఞులు కూడా ఎక్కువ పరుగులు ఇవ్వడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆటగాళ్లపై అలసట ప్రభావం చూపుతోందని, సుదీర్ఘ సీజన్ కారణంగా వారు ఫిట్‌నెస్‌లో తగ్గుదల కనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించే బుమ్రా ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం జట్టు దుస్థితికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

