కలం, వనపర్తి: బాల్య వివాహాలను అరికట్టి బాలల హక్కులను పరిరక్షించాలనే సంకల్పంతో రాజపేట (Rajapeta) గ్రామాన్ని ‘బాల్య వివాహ రహిత గ్రామం’గా ఏకగ్రీవంగా ప్రకటించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు తీర్మానం చేశారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ప్రతినిధులు గ్రామసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలల హక్కులు, బాల్య వివాహ నిరోధక చట్టం–2006పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. బాల్య వివాహానికి పాల్పడితే చట్ట ప్రకారం జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాలబాలికలను తప్పనిసరిగా బడిలో కొనసాగిస్తూ, బాల్య వివాహాలను అడ్డుకుంటామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు.
బాల్య వివాహాలపై సమాచారం ఉంటే 1098, 112, 100 హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. అనంతరం సర్పంచ్ వెంకన్న, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం చేసి రాజపేటను బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు. కార్యక్రమంలో డీసీపీవో ఎం. రాంబాబు, సీడబ్ల్యూసీ సభ్యురాలు ఎల్. వనజకుమారి, పీఓ ఐసీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

