కలం, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఆయన సోదరుడికి మట్టి దోపకంపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజల మనోభావాలు, ఆకలి మీద లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. ఆదివారం మంథని పట్టణంలోని తమ్మిచెరువును (Thammi Cheruvu) సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మన పూర్వీకుల కాలం నుంచి తమ్మిచెరువులో బతుకమ్మలను ఆడే ఆనవాయితీ ఉండేదని తెలిపారు. ఈ చెరువును ఆనాడు తాము సుందరీకరణ చేశామని, అయితే పనులు ఎక్కడైతే ఆగిపోయాయో మూడేళ్లు అయినా పనులు అక్కడే ఉన్నాయని, సారుకు మంత్రి పదవి వచ్చినా తట్టెడు మట్టి పోయలేదని ఎద్దేవా చేశారు.
తాము ఏనాడు ఓట్ల కోసం, రాజకీయం కోసం మాట్లాడమని, తమ మాటలకు తమ్మిచెరువు నిలువెత్తు సాక్ష్యమని చెప్పారు. ఆనాడు తమ్మిచెరువును అద్భుతంగా తీర్చిదిద్ది బోటింగ్, స్నాక్స్ పాయింట్, రింగ్రోడ్డును ప్రతిపాదన చేశామని.. 70 శాతం పనులు పూర్తి కాగా ప్రభుత్వం మారిపోవడంతో అక్కడే ఆగిపోయాయని, మూడేళ్లయినా ముందుకు సాగలేదని విమర్శించారు. ఈనాడు కమీషన్ల కోసం రోడ్లు చేస్తున్నారని, ఈ చెరువు పనులకు కమీషన్లు ముట్టకపోవడంతోనే పనులు చేయడం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ కమీషన్లు ముడితే ఎన్నికలకు ముందు చేస్తారేమోనని అన్నారు.
మంథనిలో ఉన్న చెరువుల్లో కావాలనే మట్టి తీసి పెద్దగా ఉన్న చెరువులను చిన్నగా చేశారని, ఇందుకు రావుల చెరువు నిదర్శనమన్నారు. మంథనిలో గొప్పగా అభివృద్ధి జరుగుతోందని వచ్చిపోయేవారు అనుకునేలా రోడ్ల పనులు చేస్తున్నారే తప్ప, చదువుకున్న యువకులు, మహిళల కోసం దుద్దిళ్ల శ్రీధర్ ఆలోచన చేయడం లేదన్నారు. 40 ఏళ్లుగా అధికారం ఇస్తూ నాలుగుసార్లు మంత్రి పదవులు ఇప్పిస్తే నాలుగు పనులు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఏదో పెద్ద స్థాయిలో ఉన్నారని, మంచిగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మున్సిపాలిటీని పెద్ద మెజార్టీతో అప్పజెప్తే పాలకవర్గం కూడా ఏమీ చేయడం లేదని, నాయకత్వం లాగే పాలకవర్గం కూడా వ్యవహరిస్తోందని, వాళ్లు మట్టి దోపిడీ చేస్తుంటే పాలకవర్గం చెత్త దోపిడీ చేస్తోందని ఆరోపించారు.
రోడ్ల పనులకు కమీషన్లు ఇస్తున్నారు కనుకనే ఆ పనులకే ప్రాధాన్యత ఉందని, కమీషన్ల కోసం ఎన్ని ధ్వంసం చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మంథని–రామగుండం రోడ్డు విస్తరణ ఉంటుందని తెలిసినా ఆనాడు లైట్లు ఏర్పాటు చేశారని, ఈనాడు మళ్లీ విస్తరణ పేరుతో ఆ లైట్లను తొలగించారని అన్నారు. ఈ లైట్ల ఏర్పాటుకు కోట్ల రూపాయలు వెచ్చించారని, కమీషన్ల కోసం లైట్లు వేశారని, కమీషన్లు ముట్టినాక లైట్లు తీసేశారని, మళ్లీ కొత్త లైట్ల కోసం కమీషన్లు తీసుకుంటారని ఆయన అన్నారు. తమ నాయకుడిని నమ్మి ప్రజలు అవకాశం ఇస్తే మూడేళ్లయినా తమ్మిచెరువు గురించి ఆలోచన చేయలేదని, అయ్యగారి చెరువుకు సుందరీకరణ ఎందుకో సమాధానం చెప్పాలన్నారు. మూడేళ్లుగా తమ్మిచెరువు చీకటిగా ఉండటం సమాజానికే అవమానమని అన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే కళ్లు తెరిచి అభివృద్ధి పనులు చేయాలని డిమాండ్ చేశారు.

