కలం, మధిర : క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి, సకాలంలో వైద్యం అందించాలనే లక్ష్యంతో మధిరలో (Madhira) నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభించింది. మధిర రిక్రియేషన్ క్లబ్, కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో ఆదివారం ఈ శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి వందలాది మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరి సత్యనారాయణ, మధిర మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. శరీరంలో అసాధారణ మార్పులు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధిర రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు చావా రామకృష్ణ, కార్యదర్శి గడ్డం శ్రీనివాసరావు, కోశాధికారి ములకలపల్లి మోహన్రావు, రాయపాటి శ్యామ్, కొంకా రమేష్, తేల కొండలరావుతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

