కలం, వెబ్డెస్క్: హైదరాబాద్లోని నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ కాలేజీ (MVSR College)లో శనివారం రాత్రి నిర్వహించిన దాండియా నైట్స్ (Dandiya Night)లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కాలేజీ యాజమాన్యంపై పోలీసులు నేడు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై ఆదిబట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాండియా వేడుకల సందర్భంగా లైటింగ్ ట్రస్ కూలిన ఘటనపై కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లైటింగ్ ట్రస్ కూలిపోవడానికి గల కారణాలు, ప్రమాదానికి బాధ్యులెవరనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

