కలం, వెబ్ డెస్క్ : పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన వ్యక్తి క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ బాగోలేదంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగాన్ని తొలగించిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. పరస్పర అంగీకారంతో ఉన్న ఇద్దరు అవివాహితుల మధ్య శారీరక సంబంధం, కేవలం దాని ఆధారంగా ఒక వ్యక్తి నడవడికపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరచుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2014లో తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసు కారణంగా, స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్‌గా తాత్కాలికంగా ఎంపికైన ఒక అభ్యర్థిని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రద్దు చేసిన కేసును విచారించిన జస్టిస్ మన్మోహన్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే యువకుడు 2014లో ఒక మహిళతో ప్రేమాయణం సాగించారు. మహిళను పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసి శృంగారంలో పాల్గొన్నారనే ఆరోపణల ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈ విషయం 2015లో లోక్ అదాలత్‌లో రాజీ కుదిరింది. అభ్యర్థి తన దరఖాస్తు ఫారంలో ఈ కేసు గురించి వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ సమయంలో సుప్రీం కోర్టు రిక్రూట్ మెంట్ బోర్డు వైఖరిని తప్పుబడుతూ తిరుపతికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. లోక్ అదాలత్ ముందు వివాహ వాగ్దానంపై అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోవడం అనేది నేరాన్ని అంగీకరించినట్లు కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రస్తుత ఆధునిక సమాజంలో పరస్పర అంగీకారంతో పెళ్లికి ముందు సంబంధాలు కలిగి ఉండటం సర్వసాధారణమని కోర్టు పేర్కొంది. ఒక బంధం పెళ్లికి దారితీయకుండా మధ్యలోనే ముగిసిపోయినంత మాత్రాన సదరు అభ్యర్థికి చెడ్డ ప్రవర్తన ఉన్నట్లు కాదని, నియామక సంస్థలు ఇలాంటి సామాజిక మార్పులను గమనించాలని స్పష్టం చేసింది. దాదాపు పదేళ్ల క్రితం ముగిసిపోయిన ఈ వ్యవహారాన్ని సాకుగా చూపి, ఒక యువకుడి కెరీర్‌ను ప్రభుత్వ ఉద్యోగాన్ని నిరాకరించలేరని పేర్కొంటూ తిరుపతికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

