కలం, వెబ్‌డెస్క్: నార్వే చెస్ (Norway Chess) టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు అదిరిపోయే ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. ఏడో రౌండ్ ముగిసేసరికి మన స్టార్ ప్లేయర్లు ప్రజ్ఞానంద (Praggnanandhaa), గుకేశ్ (Gukesh), దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) అద్భుత విజయాలు సాధించి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. టోర్నమెంట్ చివరి దశకు చేరుకోవడంతో మ్యాచ్‌లు చాలా ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మొదటగా పురుషుల విభాగంలో, భారత యువ స్టార్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు.. అలీరెజా ఫిరౌజ్జా (Alireza Firouzja) పై క్లాసికల్ చెస్‌లో అద్భుత విజయం సాధించారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో ప్రజ్ఞానంద తన అద్భుతమైన టెక్నిక్‌తో ప్రత్యర్థిని ఓడించారు. ఈ టోర్నమెంట్‌లో అలీరెజాకు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.
మరోవైపు ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్, వెస్లీ సో మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ హోరాహోరీగా సాగి డ్రాగా ముగిసింది. ఆ తర్వాత జరిగిన అర్మగెడాన్ గేమ్‌లో గుకేశ్ అద్భుతంగా ఆడి విజయం సాధించారు. దీనివల్ల ఆయనకు అదనపు పాయింట్లు లభించాయి. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్, విన్సెంట్ కేమర్ మధ్య జరిగిన క్లాసికల్ మ్యాచ్ కూడా డ్రా అయింది. అయితే ఆ తర్వాత జరిగిన అర్మగెడాన్ మ్యాచ్‌లో కార్ల్‌సన్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రేసులో నిలిచారు.
ఏడో రౌండ్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. వెస్లీ సో 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలీరెజా ఫిరౌజ్జా 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, మాగ్నస్ కార్ల్‌సన్, విన్సెంట్ కేమర్, ప్రజ్ఞానంద రమేశ్‌బాబు 9 పాయింట్లతో వారి వెంటే ఉన్నారు. ఇక మహిళల విభాగానికి వస్తే.. భారత్‌కు చెందిన హంపి కోనేరు, దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. అనంతరం నల్లటి పావులతో ఆడిన అర్మగెడాన్ గేమ్‌లో దివ్య దేశ్‌ముఖ్ విజయం సాధించి అదనపు పాయింట్లు సొంతం చేసుకున్నారు.
ఇదే విభాగంలో బిబిసార అసౌబయేవా.. జూ జినెర్‌పై క్లాసికల్ గేమ్‌లో ఘన విజయం సాధించి టోర్నమెంట్‌లో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. అలాగే ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జూ వెన్‌జున్ (Ju Wenjun), అన్నా ముజిచుక్ (Anna Muzychuk) మధ్య క్లాసికల్ మ్యాచ్ డ్రా కాగా, అర్మగెడాన్ గేమ్‌లో ముజిచుక్ విజయం సాధించారు. ప్రస్తుతం మహిళల పట్టికలో బిబిసార అసౌబయేవా 12.5 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ 10 పాయింట్లతో రెండో స్థానంలో, అన్నా ముజిచుక్ 9.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

