కలం, ఆదిలాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణ, దేశ సరిహద్దుల రక్షణలో విధి నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరవీరుల (Adilabad Police Martyrs) స్తూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, న్యాయమూర్తి హుస్సేన్ నాయక్, అదనపు ఎస్పీ పి. మౌనిక, ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తదితరులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం పోలీసులు ప్రాణాలను సైతం అర్పిస్తున్నారని అన్నారు. పోలీసుల నిస్వార్థ సేవలకు ప్రజలు సహకరించాలని, నేర నియంత్రణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ నిరంతరం స్మరించుకోవాలని అన్నారు.

