కలం, వెబ్ డెస్క్: ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారాన్ని హోరెత్తించేందుకు ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ (Janasena Express) ప్రచార రథం సిద్ధమైంది. ఈ ప్రత్యేక ప్రచార వాహనాన్ని హైదరాబాద్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అభ్యర్థి, మాజీ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ, ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళిపై పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టమైన సూచనలు చేశారు.
ఈ సందర్భగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఈ ‘గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ కేవలం ఓట్ల సేకరణ కోసం తిరిగే సాధారణ ఎన్నికల వాహనం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, పట్టభద్రుల సవాళ్లు, యువత ఆకాంక్షలను నిరంతరం తెలుసుకునే ఒక సజీవ ప్రజాసేవా వేదికగా ఇది పనిచేయాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యావంతులు, యువతతో మమేకమవుతూ వారి ఆలోచనలకు ప్రతీకగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు, జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొని, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం పొందారని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

