కలం, జగిత్యాల: కుష్ఠు వ్యాధిని ముందే గుర్తించి మెడిసిన్ వాడితే వైకల్యాన్ని నివారించావచ్చని జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ సుజాత (Jagtial DMHO Sujatha) అన్నారు. జగిత్యాల జిల్లా ధరూర్ (Dharur) గ్రామంలో కొనసాగుతున్న కుష్టు వ్యాధి (Leprosy) సర్వేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, MLHPలు, ఆశా వర్కర్లు, ANMలు, ఫీల్డ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న సర్వే తీరును, రికార్డులను డీఎంహెచ్ఓ పరిశీలించారు. 100 శాతం ఇళ్లను కవర్ చేయాలని, ఒక్క కేసు కూడా మిస్ కాకూడదని ఆదేశించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుజాత మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధని తెలిపారు. చర్మంపై తెల్లటి/ఎర్రటి మచ్చలు, స్పర్శ తెలియకపోవడం, తిమ్మిరి, చేతులు, కాళ్ళలో బలహీనత వంటి లక్షణాలుంటే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదని.. తాకితే రాదని స్పష్టం చేశారు. ఇది వంశపారంపర్య వ్యాధి కాదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా MDT మందులు లభిస్తాయని తెలిపారు. 6 నుంచి 12 నెలల్లో పూర్తిగా నయమవుతుందని వివరించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని PHC ని సంప్రదించాలని, ఆశా వర్కర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది చేస్తున్న కృషిని సుజాత అభినందించారు.

