కలం, వెబ్‌డెస్క్: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని (Water Saving Awareness) ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. భవిష్యత్తులో నీటి కోసం తీవ్ర సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉందని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న పంచవటి కాలనీ (Panchavati Colony) సంక్షేమ సంఘం వినూత్న కార్యక్రమం చేపట్టింది. కాలనీలో వార్డు నెంబర్ 127లో ఓ వ్యక్తి సైకిల్‌పై మైక్ ఏర్పాటు చేసుకుని వీధుల్లో తిరుగుతూ నీటిని వృథా చేయొద్దని ప్రచారం చేశారు. సెల్లార్లు, రోడ్లు, కార్లు, టెర్రస్‌లు కడిగేందుకు ట్యాప్ వాటర్‌ను, బోర్ వాటర్ ను వృథా చేయవద్దని నివాసితులకు సూచించారు. ఈ వినూత్న ప్రచారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొదట ఈ ప్రచారాన్ని హైడ్రా అధికారులు లేదా ప్రభుత్వం చేపట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తర్వాత పంచవటి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తాజాగా వెల్లడైంది. దీంతో కాలనీవాసులను నెటిజన్లు అభినందిస్తున్నారు. నీటి కొరతను నివారించేందుకు ప్రభుత్వాలపైనే ఆధారపడకుండా ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా నీటిని పొదుపు చేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతి కాలనీ, గ్రామంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడితే నీటి వృథాను అరికట్టి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

