కలం, వెబ్ డెస్క్: మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్(DY Chandarchud)పై సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ (Sanjay Kishan Kaul) సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిల నియామకాల విషయంలో చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వంతో అతిగా అనుకూలంగా వ్యవహరించేవారని పేర్కొన్నారు. కొలీజియం పంపిన పేర్లను కేంద్రం తిరస్కరించినప్పుడు.. ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఫోన్ చేయాలా.. అని తనను అడిగారని వివరించారు. సీజేఐ అలా చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని.. కొలీజియం నిర్ణయాలపై ప్రభుత్వ ఆమోదం కోరడం సరైంది కాదని తేల్చి చెప్పారు. ఈ మేరకు తన అనుభవాలతో రూపొందించిన ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’ పుస్తకంలో కీలక విషయాలు వెల్లడించారు
ప్రభుత్వ జోక్యం పెరిగింది..
జడ్జిల నియామకాల్లో ప్రభుత్వ జోక్యం పెరిగిందని.. తన అభిప్రాయాలను బలంగా కొలీజియం ముందుకు తెస్తోందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ (Sanjay Kishan Kaul) పేర్కొన్నారు. కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం ఆమోదించకపోతే.. తన నిర్ణయానికే కట్టుబడి ఉండాలా.. లేదా ప్రభుత్వ అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలా.. అనే ప్రశ్న ఎదురవుతోందన్నారు. కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు కానీ, నియామకాల్లో మాత్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగబద్ధం కాదన్నారు. కొలీజియం వ్యవస్థలోనూ లోపాలున్నాయని సంజయ్ అంగీకరించడం గమనార్హం.
ఆ జడ్జి నియామకంపై చర్చ..
మైనార్టీ మతానికి చెందిన జడ్జిని నియమించే క్రమంలో జరిగిన ఘటనను సంజయ్ కిషన్ కౌల్ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. సదరు జడ్జి కుటుంబం తరతరాలుగా అదే మతాన్ని అనుసరిస్తోందంటూ కొలీజియంలో ప్రశ్నించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ అంశంపై అప్పటి సీజేఐ చంద్రచూడ్‌తో తీవ్ర చర్చ జరిగిందన్నారు. చివరికి తాను కొలీజియం సమావేశం నుంచే బయటకు వెళ్లిపోయినట్లు వివరించారు. సంజయ్ కౌల్ వ్యాఖ్యలు ఇప్పుడే చర్చనీయాంశంగా మారాయి.
జస్టిస్ చంద్రచూడ్ ఏమన్నారంటే..
సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యలపై మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. కొలీజియంలో జరిగిన చర్చలన్నీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయన్నారు. ఏకాభ్రిపాయంతోనే నియామకాలు చేపట్టినట్లు వివరించారు. సమావేశం నుంచి సంజయ్ కిషన్ కౌల్ బయటకు వెళ్లిన విషయం తనకు గుర్తు లేదన్నారు.
Also Read : వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మురళీ కార్తీక్ ఫైర్
Follow Us On: X(Twitter)

