కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాజ్యాంగ బద్ధంగా అమలులో ఉన్న 50శాతం రిజర్వేషన్లలో రాజకీయ వాటా కావాలని ఓసీ జేఏసీ(OC JAC) డిమాండ్ చేసింది. సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ జేఏసీ మహా ధర్నా నిర్వహించింది. దీనికి సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నేతలు, నాయకులు మాట్లాడుతూ ఓసీల సంక్షేమం, అభ్యున్నతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు డిమాండ్లు ఉంచారు.
ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓసీ(OC) విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ప్రత్యేక ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ కోటా కేటాయింపులోని లోపాలను సరిదిద్దాలని, వార్షికాదాయం పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 50శాతం రిజర్వేషన్లలో ఓసీలకు రాజ్యాంగబద్ధ వాటా కల్పించాలని కోరారు.
ఉద్యోగుల రక్షణ ఏది..?
ఉద్యోగులను రక్షించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఓసీ సంఘం(OC JAC) నాయకులు ఆరోపించారు. OC సామాజిక సంఘం సభ్యుల సమావేశంలో అధికారులు మాట్లాడిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఓసీజేఏసీ నేతలు ఆరోపించారు.
ఉద్యోగుల రక్షణ కోసం సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, జీతాల సమస్యలు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కార బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల పనిభారం పెరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యలు, ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ భద్రత వంటి అంశాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ ఎంపికలు జరగకపోవడం వల్ల యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ధర్నాలో ఓసీజేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, చైర్మన్ నల్ల సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి, రాజన్న జిల్లా కన్వీనర్ సిరిసిల్ల రాజేందర్ శర్మ, కో కన్వీనర్ భూపాలపల్లి కరుణాకర్, జేఏసీ కన్వీనర్ సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, బద్దం నారాయణ రెడ్డి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.


