కలం, వెబ్ డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు, ఊబకాయం, గుండె జబ్బులు, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బాడీలోని ఫ్యాట్స్ తగ్గాలన్నా, సన్నగా మారాలన్నా చాలా మంది ఎంచుకునే ఫుడ్ ఓట్స్. ఓట్స్ తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు (Oats Health Benefits) చేకూరుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఓట్స్‌లో ఉండే అధిక ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు దూరమవ్వడమే కాకుండా కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. ఫలితంగా తక్కువ ఆహారం తింటారు కాబట్టి బరువు తగ్గుతారు.
అయితే, తాజాగా ఓట్స్ గురించి కొన్ని సరికొత్త ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, ఓట్స్ మన బాడీలోని చెడుకొలెస్ట్రాల్‌ను ఊహించని విధంగా తగ్గిస్తాయని తేలింది. అయితే ఈ వివరాలన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని గుర్తించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
రోజుకు 300గ్రాముల ఓట్స్‌తో ప్రయోగం
ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 32 మంది ఆడ, మగవారిని ఎంచుకున్నారు.
డైట్ ప్లాన్: వీరు రెండు రోజుల పాటు కేవలం నీటిలో ఉడకబెట్టిన ఓట్స్‌ను మాత్రమే రోజుకు మూడు పూటలా తీసుకున్నారు. వీటికి అదనంగా తమ భోజనంలో కొన్ని పండ్లు, కూరగాయలు మాత్రమే జతచేశారు.
కేలరీల నియంత్రణ: ఈ రెండు రోజుల్లో వారు రోజూ తినే సాధారణ కేలరీల కంటే సగం మాత్రమే తీసుకున్నారు.
పరిశోధనలో తేలిన నిజాలు
ఈ రెండు రోజుల ఓట్స్ డైట్ తర్వాత ప్రయోగంలో పాల్గొన్న వారిని పరీక్షించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.
1. 10 శాతం తగ్గిన చెడు కొలెస్ట్రాల్: వారి శరీరంలో గుండెకు హాని కలిగించే ప్రమాదకరమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఏకంగా 10 శాతం వరకు తగ్గాయి.
2. 2కిలోల బరువు లాస్: కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వారు రెండు కిలోల వరకు బరువు తగ్గినట్లు కూడా పరిశోధకులు గుర్తించారు.
3. ఆరు వారాల పాటు ప్రభావం: ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కేవలం రెండు రోజులు మాత్రమే ఈ డైట్ చేసినప్పటికీ, దాని సానుకూల ప్రభావం ఆరు వారాల తర్వాత కూడా వారి శరీరంలో స్పష్టంగా కనిపించింది.
పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెంపు
ఓట్స్‌లోని బీటా–గ్లూకాన్ అనే ప్రత్యేక ఫైబర్, పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు మన పేగుల్లోని సూక్ష్మజీవులపై సానుకూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. ఓట్స్ తినడం వల్ల జీవక్రియను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియా సంఖ్య వేగంగా పెరుగుతుందన్నారు. ఈ బ్యాక్టీరియా ఓట్స్‌ను విచ్ఛిన్నం చేసి ఫెరులిక్ యాసిడ్ వంటి మేలు చేసే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది పేగులలోని కణాలకు అవసరమైన శక్తిని అందించి, అవి మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. తద్వారా కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి కంట్రల్‌లోకి వస్తుందని తెలిపారు.
ఆరు వారాల కంటే.. రెండు రోజులే మేలు!
ఆరు వారాల పాటు రోజూ కొద్దికొద్ది పరిమాణంలో ఓట్స్ తినడం కంటే, రెండు రోజుల పాటు ఎక్కువ పరిమాణంలో ఓట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడంలో మరింత వేగవంతమైన, మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.
ఆరోగ్య ప్రయోజనాలు
ఓట్స్ క్రమంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వేగంగా బరువు తగ్గడం, హైబీపీ నియంత్రణలోకి రావడం, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి రావడం వంటి లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
Note: ఈ ప్రయోగ ఫలితాలు ఎంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఓట్స్‌ను కొలెస్ట్రాల్, బీపీ తగ్గించే మెడిసిన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రం చూడకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఓట్స్‌ను ఎల్లప్పుడూ ఆరోగ్యానికి సహాయకారిగా మాత్రమే చూడాలని, ముఖ్యంగా మీ శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక డైటీషియన్ లేదా డాక్టర్‌ను కలవాలని సూచిస్తున్నారు.

