కలం, ఆదిలాబాద్ : ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు ఫ్లాగ్ డే (Police Flag Day) సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరులను స్మరిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో సుమారు 250 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు 50 మంది డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
పట్టణంలోని కలెక్టర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. అక్కడ పోలీసు అమరవీరుల చిత్రపటాల వద్ద ఎస్పీతో పాటు పోలీసు అధికారులు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అమరవీరుల త్యాగాలు పోలీసు సిబ్బందికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

