కలం, నిజామాబాద్ బ్యూరో : ఆలిండియా సర్వీసెస్ అధికారులు తమ శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నిశితంగా పరిశీలన జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Nizamabad Collector) సూచించారు. 14 మందితో కూడిన ఆలిండియా సర్వీసెస్ అధికారులు శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం శనివారం నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ఈ నెల 21 నుండి 28 వరకు క్షేత్రస్థాయి పరిశీలన జరుపనున్నారు. నేడు సమీకృత జిల్లా కార్యాలయంలో వారు కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా అలోక్ సింగ్, లోకేష్ మనోహర్ పాటిల్, మనిష్ పరిహార్, ప్రవీణ్ కుమార్, సచిన్ గోయెల్, శివం, రోమేల్ బిజల్వాన్, అభిషేక్ పరిహార్, దీపక్ శర్మ, నిహాల్ చంద్, పూజా మీనా, శుభం శుభ్, వికాస్ యాదవ్, నిధి కరన్వాల్ లను జిల్లా పాలనాధికారి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. వీరిని రెండు బృందాలుగా విభజిస్తూ, ఒక్కో బృందానికి ఒక్కో గ్రామాన్ని క్షేత్రస్థాయి పరిశీలన కోసం కేటాయించారు. ఆర్మూర్ డివిజన్ లోని అంకాపూర్ కు ఒక బృందాన్ని, బోధన్ డివిజన్ లోని భూలక్ష్మిక్యాంపు నకు మరో బృందాన్ని కేటాయించారు. క్షేత్రస్థాయి సందర్శనకు బయలుదేరి వెళ్లడానికి ముందు వారు కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ట్రైనీ ఐఏఎస్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక సూచనలు చేశారు. నిజామాబాద్ ప్రధానంగా వ్యవసాయాధారిత జిల్లా అయినందున సాగు రంగంపై ఆధారపడి 70 శాతం మంది జీవనాలు వెళ్లదీస్తున్నారని వివరించారు. జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్ సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ఎంతో కీలకంగా నిలుస్తోందని, అవకాశం మేరకు ఈ ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించాలని, భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమాన్ని, ప్రజల జీవన స్థితిగతులను గమనించాలని అన్నారు. అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరిపి ఆకళింపు చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, ఇంచార్జి డీపీఓ నాగరాజు, సీ.పీ.ఓ రతన్, కలెక్టరేట్ ఏ.ఓ బాలరాజు, ఆర్మూర్, బోధన్ తహసిల్దార్లు సత్యనారాయణ, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

