కలం, నిర్మల్ : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు సమ్మె (NHM Employees Strike) బాట పట్టడంతో ప్రభుత్వ వైద్య సేవలపై ప్రభావం పడుతోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లాలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం జేఏసీగా ఏర్పడి సమ్మె చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ వైద్యశాలల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 281 మంది ఉద్యోగులు సమ్మె నోటీసులు అందజేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనకు దిగినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి..
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత లభించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి హెల్త్ సొసైటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేరుగా వేతనాలు చెల్లించాలని, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 180 రోజుల ప్రసూతి సెలవులు అమలు చేయాలని కోరుతున్నారు. ఈఎస్ఐ, పీహెచ్ఎస్ సౌకర్యాలు కల్పించడంతోపాటు పెండింగ్లో ఉన్న తొమ్మిది నెలల పీఆర్సీని అమలు చేయాలని, జీవో నంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామీణ వైద్య సేవలకు అంతరాయం..
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె (NHM Employees Strike) తో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. హెల్త్ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, డేటా ఆపరేటర్లు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో ప్రజారోగ్య సేవలపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. 2007 నుంచి దశలవారీగా పోరాటం చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, దానిని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశించామని తెలిపారు. చాలీచాలని వేతనాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న తమ కృషిని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

